ప్ర‌ధాని సొంత రాష్ట్రం గుజ‌రాత్‌‌లో ఉద్రిక్త‌త‌..

09:55 - October 8, 2018

అహ్మ‌దాబాద్: చిన్నారిపై లైంగిక దాడి ఘ‌ట‌న‌తో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన‌ గుజ‌రాత్ లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. గుజ‌రాత్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ వాసులు ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోతున్నారు. గుజ‌రాత్ రాష్ట్రం వ‌దిలి పారిపోతున్నారు. గుజరాతీ చిన్నారిపై స్థానికేతరుడు అత్యాచారానికి పాల్ప‌డాడ్డు. ఈ కేసులో బీహార్ నుంచి వలస వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అల్లరిమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఈ క్రమంలో బీహార్, యూపీ నుంచి వలసవచ్చిన  కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. 

గాంధీనగర్ తో పాటు అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలస దారులను లక్ష్యంగా చేసుకొని వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. ఇక ఈ అత్యాచార‌ ఘటనపై సోషల్ మీడియాలో కొంద‌రు విద్వేష పూరిత పోస్టులు పెట్ట‌డంతో ఈ దాడులు మ‌రింత పెరిగాయి. దీంతో పొట్ట కూటి కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ ప్రాణాలను అరచేత పట్టుకుని సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి.

అహ్మదాబాద్‌కు సమపంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ పట్టణంలో సెప్టెంబ‌ర్ 28న ఓ 14 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో ఓ బీహార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాతీ ప్రజల్లో బీహార్ సహా వలసదారులపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వీటికి ఆజ్యం పోస్తూ సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఠాకూర్ సేన అనే సంస్థ బీహార్, యూపీ ప్రజలు వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రాంత  వాసులకు పని ఇవ్వరాదని దుకాణాల యజమానులకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో తమ సొంత రాష్ట్రాలకు త‌ర‌లిపోతున్నారు.

ఈ ఘ‌ట‌న‌ల‌తో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగా స్థానికేత‌రుల‌పై దాడి చేసిన 342మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 42కేసులు న‌మోదు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. స్టేట్ రిజ‌ర్వ్డ్ పోలీసుల‌కు చెందిన 17 కంపెనీల‌ను రంగంలోకి దించారు. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో గ‌స్తీని పెంచారు.

Don't Miss