ఓటుకి పోదాం పదపదా.. పల్లెబాటలో సిటీ జనం

17:45 - December 6, 2018

పండగలకు ఊరెళ్లే జనం ఈసారి ఓట్ల కోసం కదిలారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ మహా నగరంలో స్థిరపడిన వారు అందరూ కూడా పల్లెలకు పయనం అయ్యారు. సొంతూరులో ఓటు వేయటంలో ఉండే కిక్కే వేరు అంటున్నారు. డిసెంబర్ 7వ తేదీ ఓటు వేసేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివెళుతుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఊహించని విధంగా ప్రజలు ఒక్కసారిగా రావటంతో బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. ముందుగానే ఊహించిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. అయినా సరిపోలేదు. 
వరసనగా మూడు రోజులు సెలవులు :
డిసెంబర్ 7వ తేదీ శుక్రవారం పోలింగ్ సెలవు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా సెలవు దినం ప్రకటించాయి. స్కూల్స్ కూడా హాలిడే. శుక్రవారం పోలింగ్ సెలవు వచ్చింది.. డిసెంబర్ 8వ తేదీ సెకండ్ శాటర్ డే.. 9వ తేదీ ఆదివారం. మూడు రోజులు వరసగా సెలవులు వచ్చాయి. పిల్లలకు కూడా సెలవు. దీంతో గతంలో కంటే పెద్ద సంఖ్యలోనే ప్రజలు సొంతూర్లకు కదిలారు. పోలింగ్ తోపాటు.. రెండు రోజులు సొంతూరులో ఉండొచ్చని ఉద్దేశంతో ఈసారి భారీ స్పందన వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజల రద్దీతో మరిన్ని బస్సులు నడుపుతున్నట్లు కూడా ప్రకటించింది ఆర్టీసీ. జిల్లాలకు వెళ్లే బస్సుల్లో నిల్చోవటానికే సీట్లు లేవు. నిలబడి వెళుతున్నారు. స్పెషల్ సర్వీసులు నడపటంలో ఆర్టీసీ అధికారులపై విమర్శలు కూడా వస్తున్నాయి.

Don't Miss