టపాసులు, స్వీట్‌ షాపులపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు దాడులు

09:25 - November 5, 2018

హైదరాబాద్: పండగ కోసం షాపింగ్‌ చేసేవారిని దోచుకునేందుకు వ్యాపారులు సిద్దమవుతున్నారు. గత ఏడాది మిగిలిన సరుకును కొత్తగా ప్యాకింగ్‌ చేసి విక్రయించడం,.. తక్కువ తూకంతో అమ్మడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కొలతలు, తూనికల శాఖ అధికారులు.. షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్‌ జంట నగరాల్లోని టపాసులు, సీట్‌ షాపులపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దీపావళి సందర్బంగా.. టపాసులు, స్వీట్‌ షాపుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి.. అమ్మకాలు సాగిస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. 

తూనికలు, కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ ప్రకారం.. ఎమ్మార్పీకే వస్తువులను విక్రయించాలి. ఎమ్మార్పీపై స్టిక్కర్లు అంటించకూడదు. అలాగే తూకం సక్రమంగా ఉండాలి. తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ, తయారీదారు పేరు, చిరునామా, ఇతర వివరాలు ప్యాకింగ్‌ బ్యాక్స్‌లపై పేర్కొనాలి. కానీ దుకాణదారులు మాత్రం.. అలా చేయడం లేదు. స్వీట్‌షాపుల్లో సరైన తూకంలో అమ్మకపోవడం.. డబ్బా బరువును కూడా స్వీట్స్‌తోనే కలిపి తూకం వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఇక టపాసుల దుకాణాలలో గతేడాది నిల్వ ఉంచిన టపాసులకు రేట్ల ట్యాగ్‌ లైన్‌ మార్చి అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై 270 కేసులు నమోదు చేశారు. స్వీట్‌షాపులపై 180 కేసులు... క్రాకర్స్‌ షాపులపై 90 కేసులు నమోదు చేశారు. 

మొత్తానికి పండగ దగ్గర పడుతుండడంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మరి.. ఈ దాడులతోనైనా అక్రమాలకు అడ్డుకట్టపడి సామాన్యులకు మేలు జరుగుతందో.. లేదో చూడాలి.

Don't Miss