హడలెత్తించిన పులిని అంతం చేసింది హైదరాబాద్ షార్ప్ షూటర్సే

12:25 - November 5, 2018

హైదరాబాద్ : మహారాష్ట్రలో హడలెత్తించిన పులిని షార్ప్ షూటర్స్ అంతం చేసిన సంగతి తెలిసిందే. పులి రెండేళ్లుగా కంటి మీదకునుకు లేకుండా చేసింది. హైదరాబాద్‌కు చెందిన షార్ప్ షూటర్స్ నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్‌లు పులిని అంతం చేశారు. షార్ప్ షూటింగ్‌లో నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్ దిట్టలు. ఈమేరకు హైదరాబాద్‌లో వారు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పులిని చంపాలన్నది తమ ఉద్దేశం కాదని నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్‌లు అన్నారు. ఏ ఒక్కరి ప్రాణం పోవద్దన్నది మాహారాష్ట్ర ప్రభుత్వం, కోర్టు సూచన అని తెలిపారు.

గత రెండేళ్లలో 13మంది మనుషుల ప్రాణాలు తీసిన ఆడపులి 'అవని'ని అటవీ శాఖ అధికారులు అంతమొందించారు. శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని యవత్మల్‌లో హైదరాబాద్‌కు చెందిన షార్ప్ షూటర్స్ నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్‌లు పులిని కాల్చి చంపారు. అవనిని కాల్చిచంపేందుకు గత సెప్టెంబర్ లోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాని జాడ కనుగొనేందుకు అటవీ అధికారులు నానాతంటలు పడ్డారు. 3 నెలలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ 150 మంది అటవీసిబ్బంది గాలింపు చేపట్టారు. షూటర్స్‌, నిపుణులైన ట్రాకర్స్‌ ట్రాప్‌ కెమెరాలు, డ్రోన్లు, శిక్షణ పొందిన శునకాల సహాయంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టగా ఎట్టకేలకు దొరికింది. షార్ప్ షూటర్స్ పులిని అంతమొందించారు. 

అవని 2012లో యవత్మాల్‌ అడవుల్లో తొలిసారి కనిపించింది. ఆ సమీప ప్రాంతాల్లో రెండేళ్లలో పలు ఘటనల్లో పులి కారణంగా చనిపోయిన 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుఉందని ఎట్టకేలకు పులిని మట్టుపెట్టినందుకు ప్రజలు మిఠాయిలు పంచుకొని, టాపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

Don't Miss