వెస్టిండీస్‌తో భారత్ రెండో టీ20..

12:57 - November 6, 2018

లక్నో: టెస్టు, వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రోహిత్‌ సేన 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం లక్నోలోని ఏక్నా అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే విండీస్‌పై తొలిసారిగా టీ20 సిరీస్‌ గెలిచినట్టవుతుంది. 24 ఏళ్ల తర్వాత లక్నోలో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే సిరీస్‌ కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది టీమిండియా.  మరోవైపు టెస్టు, వన్డే సిరీస్‌ల మాదిరిగా పొట్టి ఫార్మాట్‌లో పరాభవం ఎదురుకాకూడదనే పట్టుదలతో పర్యాటక విండీస్‌ ఉంది. తొలి మ్యాచ్‌ ఆఖర్లో పట్టు కోల్పోయిన విండీస్‌ రెండో టీ20లో మాత్రం నెగ్గి సిరీస్‌ను చివరి మ్యాచ్‌ వరకు తీసుకెళ్లాలనుకుంటోంది. సిరీస్‌లో నిలవాలంటే విండీస్‌కు ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. అందుకే టీ20 చాంపియన్‌ హోదాలో తమ అసలైన సత్తాను చాటి ప్రత్యర్థికి షాక్‌ ఇవ్వాలనుకుంటోంది.

Don't Miss