విండీస్ పై విజ‌య‌భేరి మోగించిన టీమిండియా

11:07 - October 7, 2018

రాజ్ కోట్:  భార‌త క్రికెట్ జ‌ట్టు చెల‌రేగిపోయింది. సొంత‌గ‌డ్డ‌పై ఆల్ రౌండ్ షో తో అద‌ర‌గొట్టింది. స్వదేశంలో త‌మ‌కు తిరుగులేద‌ని చాటి చెప్పింది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌ జట్టుతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. మరో రెండు రోజుల ఆట‌ మిగిలుండగానే విజ‌య‌భేరి మోగించింది. సమష్టిగా రాణించిన టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, జడేజా మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి. వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. విరాట్ కోహ్లి (139: 230 బంతుల్లో 10x4), పృథ్వీ షా (134: 154 బంతుల్లో 19x4), రవీంద్ర జడేజా (100 నాటౌట్: 132 బంతుల్లో 5x4, 5x6) సెంచరీలతో కదం తొక్కారు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో విరాట్ సేన  1-0తో ఆధిక్యంలో నిలిచింది. యువ సంచ‌ల‌నం పృథ్వీ షాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది.

శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడిన వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భార‌త జ‌ట్టు ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 262 పరుగులతో గెలిచిన రికార్డును ఈ సందర్భంగా విరాట్ సేన అధిగమించింది. మరోవైపు విండీస్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి.

విండీస్‌పై గెలుపుతో భార‌తో మ‌రో అపూర్వ ఘ‌న‌త‌ను కూడా సాధించింది. స్వదేశంలో టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో భారత్ వందో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 266వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకుంది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో శతక విజయాలు పూర్తి చేసిన నాలుగో జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియా (238 విజయాలు.. 415 మ్యాచులు) అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ (217 విజయాలు.. 515 మ్యాచులు), దక్షిణాఫ్రికా (104 విజయాలు.. 230 మ్యాచులు) టాప్-3లో ఉన్నాయి. 1952లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ తొలి టెస్టు విజయాన్ని రుచి చూసింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ 649/9(149.5)డిక్లేర్డ్
విండీస్ తొలి ఇన్నింగ్స్ 181 ఆలౌట్(48)
విండీస్ రెండో ఇన్నింగ్స్ 196 ఆలౌట్(50.5)

Don't Miss