మార్స్‌పై మరో వండర్ : ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్

18:04 - November 25, 2018

అమెరికా : అరుణగ్రహం (మార్స్) రహస్యాలను శోధించే క్రమంలో.. సోమవారం (26-11-2018) మరో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. ఆరు నెలల క్రితం నాసా ప్రయోగించిన ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్, సోమవారం మధ్యాహ్నం 2.59 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం)  1.30 గంటలకు మార్స్‌పై కాలు మోపనుంది. 2012లో మార్స్‌పై దిగిన క్యూరియాసిటీ రోవర్ తర్వాత, అరుణగ్రహంపై దిగనున్న రోవర్ ఇదే. ఈ ఏడాది మే5న ప్రయోగించింది మొదలు.. ఆరు నెలల పాటు నిర్దిష్టమైన కక్ష్యలో ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్, నిర్ణీత కాలావధిలోపే మార్స్ ఉపరితలాన్ని తాకేందుకు సిద్ధమవుతోంది. 
అనుక్షణం ఉత్కంఠభరితమే..!
మార్స్‌ ఉపరితలాన్ని తాకడానికి మూడు గంటల ముందు నుంచే స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం చివరి అంకం దశలవారీగా సాగుతుంది. 
3 గంటల ముందు.. 
మిషన్‌లోని నావిగేటర్స్ ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని సమయాన్ని సరిచేస్తాయి. మార్స్‌పైని ప్రమాదకరమైన ధూళి తుపానుల ముప్పును తప్పించేందుకే ఈ ప్రయత్నం. ఆ తర్వాత, అరుణగ్రహపు వాతావరణంలోకి ప్రవేశించక ముందు, స్పేస్‌క్రాఫ్ట్ సోలార్ ప్యానెల్ నుంచి విడివడుతుంది. తక్షణమే అందులోని బ్యాటరీ ఆన్ అవుతుంది. అనంతరం, మార్స్‌ ఉపరితలాన్ని తాకడానికి 6ని. 45 సెకన్ల ముందు.. ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్ గంటకు 12,300 మైళ్ల వేగంతో అరుణగ్రహపు వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇది 12 డిగ్రీల ఏటవాలు కోణంలో దిగితేనే స్పేస్‌క్రాఫ్ట్ మనుగడ సాగిస్తుంది. పూర్తి నిటారుగా దిగినా, మరీ ఒరిగిపోయినట్లు దిగినా అరుణగ్రహపు వాతావరణంలోనుంచి విసురుగా మళ్లీ అంతరిక్షంలోకి వచ్చి పడే అవకాశం ఉంది. 
దిగడానికి 3 ని. 7 సెకెండ్లకు ముందు..

మార్స్ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలోనే, గ్రహ ఉపరితలానికి ఏడు మైళ్ల ఎత్తులో, గ్రహంపై కాలు మోపడానికి 3 నిమిషాల 7 సెకెండ్లకు ముందు, స్పేస్‌క్రాఫ్ట్‌కి చెందిన సూపర్ సానిక్ పారాచూట్ తెరుచుకుంటుంది. తర్వాత, ల్యాండింగ్ కి 2 ని. 52 సెకెన్లకు ముందు.. స్పేస్‌క్రాఫ్ట్‌కి చెందిన పైరాటెక్నిక్స్, క్రాఫ్ట్‌కి అమర్చిన ఉష్ణకవచాన్ని విడిపోయేలా చేస్తాయి. స్పేస్‌క్రాఫ్ట‌కి అమర్చిన ఉష్ణకవచం, గతంలో క్యూరియాసిటీ రోవర్‌ను పంపిన మిషన్ కన్నా కూడా కొంచెం మందంగా రూపొందించారు. అత్యధిక ఉఫ్ణోగ్రతను, భారీ ధూళిని తట్టుకునేలా దీన్ని రూపొందించారు. అనంతరం, ల్యాండింగ్ కి 2ని. 42 సెకెన్లకు ముందు.. ఉష్ణకవచాన్ని వదిలేశాక పది సెకెన్లకే స్పేస్ క్రాఫ్ట్ యొక్క మూడు షాక్ అబ్జార్బింగ్ కాళ్లు (స్టాండ్స్) తెరుచుకుంటాయి. ఆ తర్వాత ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్ తనలోని గ్రౌండ్ సెన్సింగ్ రాడార్‌ను ఆన్ చేస్తుంది. 
45 సెకెన్లకు ముందు...
స్పేస్‌క్రాఫ్ట్‌ మార్స్ ఉపరితలంపై దిగడానికి నిమిషం లోపే, ఇన్‌సైట్ పారాచూట్‌ని వదిలేస్తుంది. మరో సెకెన్‌కి ల్యాండర్ తనలోని 12చిన్న రాకెట్లను పేల్చుతుంది. తద్వారా స్పేస్‌క్రాఫ్ట్ వేగం గణనీయంగా తగ్గుతుంది. అదేసమయంలో పారచూట్‌కు దూరంగా జరుగుతుంది. 
15 సెకెండ్ల ముందు మార్స్‌కి సమాంతర చలనాన్ని ఆపి, నెమ్మదిగా సెకెండ్‌కి 8 అడుగుల చొప్పున కిందికి దిగుతుంది. మార్స్‌పైకి దిగాక, 20 నిమిషాలకు, రోవర్‌కి అమర్చిన రెండు ప్యానెల్స్ తెరుచుకుంటాయి. దిగిన చోటనే కొన్ని రోజులు గడిపాక, నెమ్మదిగా అక్కడి చిత్రాలను తీసి పంపడం ప్రారంభిస్తుంది. 
8 నిమిషాలు అత్యంత కీలకం : 
అలా.. సోమవారం మధ్యాహ్నం ఈస్టర్న టైమ్ ప్రకారం 2.59 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం 26వ తేదీ అర్ధరాత్రి దాటక 1.30 గంటలకు) దిగుతుంది. అరుణ గ్రహం నుంచి కాంతి, సమాచారం భూమికి చేరేందుకు 8 నిమిషాల ఏడు సెకండ్లు పడుతుంది. రోవర్ మార్స్‌పైకి దిగినా, ప్రయోగం విజయవంతమా కాదా అన్నది వెంటనే తెలియదు. 8 నిమిషాల తర్వాతే భూమికి సమాచారం అందుతుంది.  
స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం లక్ష్యం ఏంటంటే..
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ని విశాల ఎలిజియమ్ ప్లానిషియాగా పిలిచే మార్స్ ఉష్ణ మైదానాన్ని పరిశోధించేందుకు ఉద్దేశించారు. ఇది గ్రహం బాహ్య, భూగర్భ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేస్తుంది. అలాగే, కుజగ్రహపు కంపనలను, బాహ్య, అంతర్గత ఉష్ణోగ్రతలను శోధించే నిమిత్తం పంపిన సీస్మిక్ మీటర్లనూ, రోవర్ మార్స్ ఉపరితలంపై ఉంచుతుంది. 

2010 తర్వాత పుంజుకున్న వేగం..
అరుణగ్రహపు రహస్యాలను శోధించే క్రమంలో, శాస్త్రవేత్తలు మార్స్‌పైకి స్పేస్‌క్రాఫ్ట్స్‌ పంపడం ఇదే కొత్త కాదు. అయితే 2000వ సంవత్సరం నుంచి ప్రయోగాలు వేగం పుంజుకున్నాయి. 2012లో క్యూరియాసిటీ రోవర్ తర్వాత  మార్స్‌పై దిగనున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే. 2016లో షిపరెల్లి ల్యాండర్ మార్స్‌పై క్రాష్ అయింది. 2003లో బీగల్ 2 ల్యాండర్ మార్స్‌పై దిగింది కానీ, భూమితో సంబంధాలను ఏర్పాటు చేసుకోలేక పోయింది. క్యూరియాసిటీ రోవర్ దిగిన చోటికి 340 మైళ్ల దూరంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ దిగుతుంది. 

Don't Miss