ఢిల్లీ రవాణాశాఖ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

15:48 - October 10, 2018

ఢిల్లీ: కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ ఆదాయపన్నుశాఖతో దాడులు చేయిస్తోందని ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  ఐటీ దాడుల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసాయి. తాజాగా ఈరోజు ఆమ్ఆద్మీ పార్టీ కూడా అదే వ్యాఖ్యలు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీ రవాణాశాఖ మంత్రి  కైలాష్ గెహ్లాట్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 16 ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ నేత కైలాష్ గెహ్లాట్  కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బ్రిస్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్, కార్పోరేట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే 2 సంస్ధలకు సంబంధించి పన్నుఎగవేత కేసులో, 60 మంది సభ్యుల బృందం ఢిల్లీ  గురుగావ్ ల లో 16 చోట్ల సోదాలు  నిర్వహిస్తున్నారు. గెహ్లాట్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రెండు సంస్ధల్లో చాలా లావాదేవీలు జరిగాయి కానీ లాభాలు లేవని ఆదాయపన్ను రిటర్న్  దాఖలు  చేయటంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆదాయపన్నుశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపన్ను దాడులపై స్పందిస్తూ ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్నికేంద్రం వేధిస్తోందని ట్విట్టర్లో ఆరోపించారు. 

Don't Miss