టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు

14:06 - November 3, 2018

ఖమ్మం : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో రాజకీయాల్లో చెప్పడం కష్టం. ఇప్పుడు అదే ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా ఉన్న జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. మూడు దశాబ్దాలపాటు ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండబోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి, ఇప్పుడు బహిష్కృత నేత అయిన జలగం ప్రసాద్‌రావు కారెక్కేందుకు రెడీ అయ్యారు. ఇవాళో లేక ఎల్లుండో ఆయన టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ నిర్ణయం కోసం ఆయన ఎదురు చూశారు. అయినా ఆ పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. కేటీఆర్‌ను కలిసి తన చేరికను ఫైనల్‌ చేసుకున్నారు. జలగం, తుమ్మల కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో ఉంటే... జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Don't Miss