సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి నియామకం

08:35 - November 2, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో జస్టిస్‌ సుభాష్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం గుజరాత్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్న ఆర్ సుభాష్‌రెడ్డి.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలోని రైతు కుటుంబంలో 1957లో జన్మించారు. శంకరంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో ఇంటర్, డిగ్రీని పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. సరిగ్గా 38 ఏళ్ల క్రితం 1980 అక్టోబర్ 30వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 22 ఏళ్లపాటు వేల కేసులను వాదించారు. 2002 డిసెంబర్‌లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్‌లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 13వ తేదీన గుజరాత్ ఛీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్న సీనియార్టీ దృష్ట్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు కొలీజియం సిఫారసు చేసింది. 

 

Don't Miss