కర్నాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ హవా, బీజేపీకి నిరాశ

11:05 - November 6, 2018

బెంగళూరు: కర్నాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అభ్యర్థుల హవా నెలకొంది. కర్నాటకలోని మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు కౌంటింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం ఐదు స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమి ముందంజలో ఉండగా.. ఒక చోట బీజేపీ లీడ్‌లో ఉంది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాలకు.. రామనగర, జమఖండి అసెంబ్లీ స్థానాలకు గత శనివారం ఉప ఎన్నికలు నిర్వహించారు.

* కర్నాటక ఉపఎన్నికల కౌంటింగ్ (3లోక్‌సభ, 2 అసెంబ్లీ)
* మాండ్య లోక్‌సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామెగౌడ విజయం
* రామనగర అసెంబ్లీ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం
* జమఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్ధు న్యామగౌడ విజయం
* శివమొగ్గ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి


మాండ్య, బళ్లారి లోక్‌సభ స్థానాలు.. రామనగర, జమఖండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అభ్యర్థుల హవా కనిపించింది. మాండ్య లోక్‌సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామెగౌడ, రామనగర అసెంబ్లీ స్థానంలో సీఎం కుమారస్వామి సతీమణి, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి, జమఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్ధు న్యామగౌడ విజయం సాధించారు. ఇక బళ్లారి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇటు శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. జేడీఎస్‌ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప తనయుడు మధు బంగారప్ప కూడా రాఘవేంద్రకు గట్టి పోటీనిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఈ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించారు.

Don't Miss