అరకు జంట హత్యల విచారణ వేగవంతం

21:34 - October 2, 2018

విశాఖ : అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ జంట హత్యల విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సిట్ అధికారులు పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అరకు పోలీస్ స్టేషన్ గెస్ట్‌హౌజ్‌లో విచారించనున్నట్లు తెలుస్తోంది. మాజీ సర్పంచ్ సుబ్బారావు, బిసోయ్ మూర్తి, కామరాజులను పోలీసులు విచారిస్తున్నారు. లివిటిపుట్టులో 200 మందిని అదుపులోకి తీసుకుని విచారించి, వదలిపెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23న గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళ్తున్నకిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపి, హత్య చేసిన సంగతి తెలిసిందే. 

కిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమల హత్యకు సంబంధించి ప్రాథమిక నివేదికను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ సీఎం ముఖ్యమంత్రికి అందజేశారు. సీఎం చంద్రబాబుతో సీఎస్ అనిల్ చంద్ర పునేత, డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అరకు జంట హత్యలపై నిగూఢమైన సమాచారం, సాక్ష్యాధారాలతో కూడిన కీలకమైన ప్రాథమిక నివేదికను సీఎంకు అందజేశారు. నివేదికలో ఆరుగురు ప్రధాన నిందితుల పేర్లను పొందుపరిచారు. ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా  ముగ్గురు టీడీపీ అనుచరులు, ఇద్దరు వైసీపీ అనుచరులు, ఒకరు బీఎస్పీ అనుచరుడు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచరాణలో తెలిసింది. ఈ ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. వీరి నుంచి కీలకమైన సమాచారం వస్తోంది. ’ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేని చంపేస్తారనే విషయం తమకు తెలియదని...కేవలం అక్కడ బాక్సైట్‌కు సంబంధించిన అంశంలో కేవలం వారిద్దరిని బెదిరిస్తారు.. భయపెట్టి వదిలేస్తారు..  ఆ బాక్సైట్ జోలికి రాకుండా చేస్తారనేటటువంటి సమాచారంతోటే మావోయిస్టులకు సమాచారం ఇచ్చినట్లుగా’ నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి నుంచి మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు.

 

Don't Miss