నన్ను కూడా చంపేస్తారేమో..? ప్రణయ్ తండ్రి సంచలన ఆరోపణ

12:41 - November 6, 2018

నల్లగొండ: మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  మిర్యాలగూడ పట్టణంలో సెప్టెంబర్ 14న ప్రణయ్ దారుణహత్యకు గురయ్యాడు. ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు(అమృత తండ్రి), ఎంఏ కరీం, శ్రవణ్‌కుమార్‌లపై పీడీయాక్ట్‌ నమోదైంది. ప్రస్తుతం వారంతా వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు.
తాజాగా తనకు ప్రాణహాని ఉందని ప్రణయ్ తండ్రి చెబుతున్నారు. ప్రణయ్ హత్య తర్వాత తమపై కొందరు వ్యక్తులు నిఘా పెట్టినట్లుగా అనుమానం కలుగుతోందని ప్రణయ్‌ భార్య అమృతవర్షిణి, ప్రణయ్ తండ్రి బాలస్వామి  మీడియాకు తెలిపారు. ఈనెల 3న తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి తమ ఇంట్లోకి ప్రవేశించి కలియతిరిగి వెళ్లాడని వారంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి గది తలుపు తెరచి, కర్టన్‌ తొలగించి ఇంట్లోకి తొంగి చూసినట్లుగా సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యిందన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు బలంగా ఉండి, ముఖానికి మాస్క్‌, నడుముకు నల్లని తాడు ధరించి ఉన్నట్లు చెప్పా రు. ఇంటి ఆవరణలో వ్యక్తి కదలిక సవ్వడిని గుర్తించిన పోలీసులు కిందకు వచ్చేలోపు అతడు ప్రహరీ దూకి పారిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటనతో తామంతా భీతిల్లుతున్నామన్నారు. 
తన కుమారుడిలాగే తనను కూడా చంపేస్తే అమృత మా నుంచి వెళ్లిపోతుందనే ఆలోచనతోనే ఇలా చేసి ఉంటారని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ రికార్డులను పోలీసులకు అందించామని, వాటిని పరిశీలించి తమ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రణయ్‌ కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. కాగా, రక్షణ కల్పించాలని కోరడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రణయ్ కుటుంబసభ్యులకు రక్షణగా కేటాయించారు. ప్రణయ్ ఇంటిపైగదిలో ఉంటూ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

Don't Miss