మహా కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయి

20:07 - October 10, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  చేస్తున్న ఎన్నికల వాగ్దానాలు తీరాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ చాలదని టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణాలో కడుతున్న ప్రాజెక్టులు ఆపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారని,పొరపాటున మహా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి కావని కేటీఆర్ హెచ్చరించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాతో పాటు వందలాది మంది వైశ్యులు బుధవారం తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో వెయ్యి రూపాయలు పింఛను ఇస్తానని హామీ ఇస్తే, కాంగ్రెస్  రెండు వేల రూపాయలు  ఫించను ఇస్తానని  హామీ ఇస్తోందని, ఇదీ మరీ విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. సాధారణంగా వైశ్యులు  రాజకీయాలకు దూరంగావుండి  వ్యాపారాలు నిర్వహించుకుంటుంటారని,  కేసీఆర్ అమలు చేస్తున్నసంక్షేమ పధకాలు చూసి వారు టీఆర్ఎస్ లో చేరటం చాలా సంతోషమని కేటీఆర్ అన్నారు. 

Don't Miss