సీట్ల సర్దుబాటుపై మహాకూటమి తుది కసరత్తు

10:55 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ఖరారైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు విపక్షాల పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. మహాకూటమి పేరుతో ఒక్కటైన విపక్షాలు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీల మధ్య సమన్వయం కుదరలేదు. సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. 

ఈ క్రమంలో మహాకూటమి నేతలు నేడు మరోసారి భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల ఉమ్మడి ప్రణాళికలపై తుది కసరత్తు చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పార్టీల మధ్య సీట్ల సర్దుబాబు త్వరితగతిన పూర్తి చేయాలని కూటమిలోని పార్టీలు బావిస్తున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల ప్రచారంపైనే చర్చించనున్నారు. టీడీపీ, సీపీఐ, జనసమితి కోరుతున్న సీట్ల సంఖ్యపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినప్పటికీ ఈ రోజు దానిపై ఎలాంటి వివరాలు ప్రకటించరని సమాచారం. అలాగే మహాకూటమి పేరు మార్పుపైనా చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. మహాకూటమి పేరుని తెలంగాణ పరరక్షణ వేదికగా మార్చాలని, దీనికి ఛైర్మన్‌గా కోదండరామ్ ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

మరోవైపు 48 గంటల్లో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోతే అన్ని చోట్లా పోటీ చేస్తామని జనసమితి వ్యాఖ్యానిస్తోంది. అటు సీపీఐ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు చేసుకోకపోతే ఎన్నికల ప్రచారం చేయడానికి తగినంత సమయం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Don't Miss