తుది దశకు మహాకూటమి సీట్ల పంచాయితీ

08:20 - November 2, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చిందా? 95స్థానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనపై కూటమిలోని పార్టీలు ఏమంటున్నాయి? రాహుల్‌తో కోదండరామ్ భేటీ తరువాత పంపకాల సస్పెన్స్‌కు తెరపడనుందా? ఎపట్లోగా కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలయ్యే అవకాశముంది?

మహాకూటమిలో సీట్ల స‌ర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. మిత్ర పక్షాలకు ఎన్నిసీట్లు కేటాయించాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయాని కొచ్చినట్లు తెలుస్తోంది. 119నియోజకవర్గాల్లో 95చోట్ల తాము పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో  మిగిలిన 24 స్థానాలు మహాకూటమిలోని మిత్రపక్షాలకు దక్కనున్నాయి. తెలుగుదేశం పార్టీకి 14, తెలంగాణ జనసమితికి 7, సీపీఐకి మూడు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. 20సీట్లు దక్కుతాయని తెలుగుదేశం నేతలు ఆశించినా.. ఆ సంఖ్య పద్మాలుగుకే పరిమితమైంది. దీంతో.. తెలంగాణ టీడీపీ నేతలు తాము కోరుతున్న  నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌కారం టిడిపి పోటీ చేసే స్థానాల జాబితా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. శేరిలింగంప‌ల్లి, కూక‌ట్ ప‌ల్లి, ఉప్ప‌ల్, రాజేంద్ర‌న‌గ‌ర్, ఖైర‌తాబాద్, సికింద్రాబాద్, మ‌క్త‌ల్, దేవర‌క‌ద్ర‌, కోదాడ‌, కోరుట్ల‌, వ‌రంగ‌ల్  ఈస్ట్, స‌త్తుప‌ల్లి, అశ్వ‌రావ్ పేట‌ నియోజకవర్గాల్లో తమ అభ్యర్దులను నిలబెట్టేందుకు తెలుగుదేశం నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

సీట్ల కేటాయింపు విష‌యంలో త‌మ‌కు పెద్ద‌గా ప‌ట్టింపు లేద‌ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. తుది జాబితా వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూస్తామని చెప్పారు.

కాంగ్రెస్ చెబుతున్న దాని ప్రకారం తెలంగాణ జన సమితికి ఏడు స్థానాలు దక్కుతాయి. అయితే కోదండరామ్ అండ్ టీమ్ మాత్రం 8స్థానాలకు పట్టుబడుతోంది. సీట్ల సర్దుబాటుపై ఇవాళ రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ భేటీ కానున్నారు. ఈ భేటీ  తరువాత జనసమితికి ఎన్నిసీట్లు దక్కుతాయనే దానిపై స్పష్టత రానుంది. ఇక టీజేఎస్ మ‌ల్కాజిగిరి, రామ‌గుండం, ఎల్లారెడ్డి, సిద్దిపేట  లేదా వ‌రంగ‌ల్ వెస్ట్, వ‌ర్ధ‌న్న పేట‌, తాండూరు, చెన్నూరు, మిర్యాల గూడ‌ నియోజకవర్గాలు తమకే కావాలని కోరుతోంది.

సిపిఐ పార్టీ విష‌యానికి వ‌స్తే 7 స్థానాల‌ను కోరుతున్నా.....క‌నీసం నాలుగు  స్థానాలను కేటాయించాల‌ని ప‌ట్టుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీపీఐ హుస్నాబాద్, మునుగోడు,  కొత్త‌గూడెం, బెల్లంప‌ల్లి, భధ్రాచ‌లం, దేవ‌ర‌కొండ‌, వైరా నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లో తాము వదులుకునేది లేదంటోంది. ఈనెల 8న అభ్య‌ర్థ‌ుల‌ను ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ .....కూట‌మి పార్టీల్లో అభ్య‌ర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకోమ్మ‌ని సూచించిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. 

Don't Miss