అమృతను అవ‌మానిస్తే క‌ఠిన చ‌ర్య‌లు-పోలీసుల హెచ్చ‌రిక‌

10:37 - October 8, 2018

న‌ల్గొండ‌: మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వ‌ర్షిణిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై పోలీసులు  అరెస్టు చేశారు. హైద‌రాబాద్ స‌మీపంలోని కొంపల్లి దూల‌ప‌ల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్(25) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిపై ఐపీసీ సెక్ష‌న్ 354 డీ, ఐటీ యాక్ట్ సెక్ష‌న్ 67 కింద కేసులు న‌మోదు చేశారు. అమృత చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఆ యువ‌కుడిని అరెస్ట్ చేశారు. ఇకపై ఎవరైనా అమృతపై సోషల్ మీడియాలో అసభ్యకర, అవమానకర పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ సబ్‌ డివిజినల్‌ పోలీసు అధికారి హెచ్చ‌రించారు.

కాగా, ప్రణయ్ హత్య కేసులో అమృతను దూషిస్తూ...ఆమె తండ్రి మారుతీరావును అభినందిస్తూ సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మ‌రికొంద‌రు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కామెంట్స్ చేసేవారికి వార్నింగ్ ఇచ్చేలా పోలీసులు...ఈ వ్యవహారంలో తొలి అరెస్ట్ చేశారు.

ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. కూతురు వేరే కులం వ్య‌క్తిని పెళ్లి చేసుకుంద‌నే కోపంతో అమృతి తండ్రి మారుతీరావు.. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేయించాడు. ఈ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కులపిచ్చితో ఉన్మాదిగా మారిన మారుతీరావుని క‌ఠినంగా శిక్షించాల‌ని కొంద‌రు.. తండ్రిగా మారుతీరావు చేసింది క‌రెక్టే అని మ‌రికొంద‌రు.. ఇలా ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అమృత‌కు స‌పోర్ట్ గా కొంద‌రు, వ్య‌తిరేకంగా కొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Don't Miss