తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం

09:32 - November 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోజుకో చోట కరపత్రాలు, వాల్ పోస్టర్లతో అలజడి సృస్టిస్తున్నారు. ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పుతున్న పోలీసులు.. వారిని కట్టడి చేసేందుకు ప్లాన్స్ రేడీ చేసుకుంటున్నారు. దీంతో గోదావరి పరివాహాక ప్రాంతాలు ఎన్నికల వేళ చిగురుటాకులా వణుకుతున్నాయి. 

ఎన్నికల వేళ మావోయిస్టు యాక్టివిటీ తెర పైకి వచ్చింది. ఏజెన్సీ నుంచి మొదలుకుని మండల కేంద్రాల వరకు ఉనికిని చాటుతున్నారు. బూటకపు ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉనికిని  చాటుకోవడం కోసం కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురం మండలంలో బ్యానర్లను ఏర్పాటు చేసి అదివాసీ, గిరిజనుల హాక్కులను గుర్తుచేస్తున్నారు. చాపకింద నీరులా ఉద్యమ స్పూర్తిని నింపుతున్నారు. చిట్యాల మండలం ఎన్.ఎప్.సీ గోదాం వద్ద నుంచి  ఏలేటి రామయ్యపల్లి, చిట్యాల రోడ్డుకు ఇరువైపుల కరపత్రాలు వేశారు. గురువారం వెంకటాపురం మండలం పాత్రపురం సమీపంలో బల్లకట్ట వాగు వద్ద బ్యానర్లు కట్టి తమ నిరసన తెలిపారు మావోయిస్టులు.

దళారీ నిరంకుశ, బూర్జువావర్గం, బడా భూస్వాముల, సామ్రాజ్య వాదంకి వ్యతిరేకంగా పోరాడాలని మావోయిస్టులు పిలుపునిస్తున్నారు. కేసియార్ కుటుంబ పాలన, అధికార దుర్వినయోగం, అవినీతిని ఎండగట్టలని ప్రజలకు విజ్ఞప్తి  చేస్తున్నారు. దోపిడి విదానాలను బహిర్గతం చేయాలని ప్రజలను  కోరుతున్నారు. బిజేపి బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని తిప్పికొట్టండి. ఓటుకోసం వస్తున్న పార్టీ నేతలను తన్ని తరిమికొట్టండి. తెలంగాణ జన సమితి అవకాశ వాద రాజకీయలను బహిర్గతం చేయండి.  వ్యవసాయ విప్లవాన్ని కొనసాగించాలనేది మవోయిస్టులు పంచిన కరపత్రాల సారంశం.  హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ను పునరుద్దరించాలి. దున్నేవారికి భూమి కావాలని డిమాండ్ చేస్తున్నారు...నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలని నినదిస్తున్నారు. ప్రపంచ సోషలిస్ట్ విప్లవ భావాలను అంశాలను గోదావరి పరివాహాక ప్రాంతాల్లో విస్తరింపజేస్తున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేపట్టాల్సిన అంశాలపై సమీక్షలు జరిపారు...అయితే మావోయిస్టు పార్టీ  బ్యానర్లు  పెట్టి వాటి కింద ల్యాండ్‌మైన్లను పాతిపెట్టడం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేసింది. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల నుంచి మావోయిస్టు పార్టీకి, సీఆర్పీఎఫ్‌ బలగాలకు మధ్య పోరాటం జరుగుతోంది.  గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు  మావోయిస్టులు యత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎస్పీలు, కమిషనర్లకు ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు డీజిపి ఆదేశాలు జారీ  చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో దిగుతున్న ప్రతి అభ్యర్థి భద్రతను పర్యవేక్షించాలని, మావో గెరిల్లా దాడులకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. ఇందుకు స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు...అవసరమయితే కేంద్ర బలగాలను సైతం  ఎన్నికల భద్రతకు ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు..ఇప్పటికే మావోయిస్టులు ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలని లేఖలు విడుదల చేసిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను  అదేశించింది పోలీస్ శాఖ.

ప్రచారం వేళ అభ్యర్ధులకు రక్షణ కల్పించడం పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో భద్రత, ఎన్నికల నిర్వహాణ పనులను విభజించుకుని అధికారులు ముందుకు వెళ్తున్నారు. మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి అడుగుపెట్టకుండా,అంతర్గతంగా ఉన్న యాక్షన్‌ కమిటీలపై దృష్టి  పెట్టారు..అయితే ఇన్నాళ్లూ పెద్దగా కనిపించని మావోయిస్టుల కమిటీలు.. ఇప్పుడు వ్యూహాత్మకంగా దాడులకు సిద్దమవుతుండటంతో పోలీసు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Don't Miss