టీఆర్ఎస్, బీజేపీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి- నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌

15:13 - October 7, 2018

హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాయ‌కుల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. టీఆర్ఎస్, బీజేపీ నేత‌లను మావోయిస్టులు టార్గెట్ చేశార‌ని నిఘావ‌ర్గాలు నివేదిక ఇచ్చిన‌ట్టుగా సమాచారం అందుతోంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో నాయ‌కుల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు క్ర‌మంలో పోలీసు శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. నాయ‌కుల‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర‌, మిజోరం, ఛ‌త్తీస్ ఘ‌డ్, రాజ‌స్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మెరుపుదాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని జాతీయ ద‌ర్యాఫ్తు సంస్థ‌(ఎన్ఐఏ) అధికారులు, నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. రాజ‌కీయ నాయ‌కులే టార్గెట్  గా మెరుపు దాడులు చేసేందుకు మావోయిస్టులు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎన్నిక‌లు జ‌రిగే 5 రాష్ట్రాల‌కు చెందిన యావ‌త్ పోలీసు యంత్రాంగం స‌మాయ‌త్తం కావాలని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఎన్ఐఏ అధికారులు హెచ్చ‌రించారు. ఈ మేర‌కు తెలంగాణ డీజేపీకి నిఘా వ‌ర్గాల నుంచి లేఖ అందింది. 

ఇటీవ‌లే ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో అర‌కు టీడీపీ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, ఆయ‌న అనుచ‌రుడు శివేరి సోమ‌ల‌ను మావోయిస్టులు కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. అలాంటి మెరుపు దాడులు తెలంగాణ‌లోనూ జ‌ర‌గొచ్చ‌ని, టీఆర్ఎస్- బీజేపీ నాయ‌కులను మావోయిస్టులు టార్గెట్ చేయొచ్చ‌ని నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల‌తో తెలంగాణ పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. అన్ని జిల్లాల‌ పోలీసు అధికారుల‌ను అల‌ర్ట్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనే నాయ‌కుల‌కు గ‌ట్టి భ‌ద్రత క‌ల్పించాల‌ని సూచించారు. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో(ఆదిలాబాద్, భ‌ద్రాచ‌లం, వ‌రంగ‌ల్)  గ‌ట్టి బందోబ‌స్తు క‌ల్పించాల్సిందిగా ఉన్న‌తాధికారులు ఆదేశించారు. 

ఎన్నిక‌ల తేదీలు ఖ‌రారు కావ‌డంతో ముమ్మ‌రంగా ప్ర‌చారం చేయాల‌ని అన్ని పార్టీల నాయ‌కులు రంగంలోకి దిగుతున్న వేళ.. మావోయిస్టులు మెరుపు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేయడం.. తెలంగాణ‌లోని రాజ‌కీయ నాయ‌కులను టెన్ష‌న్ పెడుతోంది. 

Don't Miss