మీటూ.. రణతుంగ నన్ను వేధించాడు

10:24 - October 11, 2018

ముంబై: ‘మీటూ’ ఉద్యమం దుమారం రేపుతోంది. దేశాన్ని కుదిపేస్తోంది. పలు రంగాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇన్నాళ్లు తమలోనే దాచుకున్న బాధలను నిర్భయంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సొసైటీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను వెలుగులోకి తెస్తున్నారు. 

మీటూ ఉద్యమం సినీ, క్రీడా రంగాలనే కాదు రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి శ్రీలంక మాజీ క్రికెటర్‌, ప్రస్తుత శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ కూడా చేరిపోయారు. రణతుంగ తనను లైంగికంగా వేధించాడంటూ ముంబైకి చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ ఆరోపించారు. ముంబైలోని ఓ హోటల్‌లో తనకు ఎదురైన ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే...

‘కొన్నేళ్ల క్రితం క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్లు ముంబైలోని జుహు సెంటార్‌ హోటల్‌లో దిగాయి. అక్కడకు వెళ్లి వాళ్ల వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుందామని నా సహచర ఉద్యోగిని కోరింది. సరేనని అక్కడికి వెళ్లాం. శ్రీలంక క్రికెటర్ల వద్దకు వెళ్లగానే నాకు భయం వేసింది. వాళ్లు దాదాపు ఏడుమంది ఉన్నారు. మేం ఇద్దరమే. నాకు అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే వెళ్లిపోదామని నా స్నేహితురాలిని కోరాను. అంతలోనే వారు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. నేను తాగలేదు. అంతలోనే మరికొందరు మమ్మల్ని హోటల్ వెనకవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీలంక క్రికెటర్‌ అర్జున రణతుంగ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా నడుము మీద చేయివేయబోయాడు. నేను అతడిని తప్పించుకుందామని ప్రయత్నించాను. ఆయన నన్ను కొట్టాడు. నేను పోలీసులతో చెప్పి పాస్‌పోర్ట్‌ రద్దు చేయిస్తానని బెదిరించాను. ఆయన వద్ద నుంచి తప్పించుకుని వచ్చి రిసెప్షన్‌లో ఫిర్యాదు చేస్తే ‘ఇది మీ వ్యక్తిగత విషయం. మేం ఎలాంటి సహాయం చేయలేం’ అని చెప్పేశారు’ అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది.

Don't Miss