సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు ఎంఐఎం వ్యూహం

13:38 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. మరి ఎంఐఎం సంగతేంటి? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మళ్లీ ఎంఐఎం పాగా వేస్తుందా? తిరుగులేని శక్తిగా అవతరించిన మజ్లిస్‌కు పోటీ ఇచ్చే వారే లేరా? అధికార టీఆర్ఎస్‌తో ఈసారి దోస్తీ కొనసాగిస్తారా? అసలు ఎంఐఎం ప్లాన్ ఏ విధంగా ఉంది?

పాతబస్తీ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే పాతబస్తీ అనే విధంగా మజ్లిస్ గట్టి పట్టు సాధించింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) దశాబ్దాలుగా హైదారబాద్‌లో పాతుకుపోయింది. 1958 మార్చి 2న అబ్దుల్ వాహిద్ ఒవైసీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఏఐఎంఐఎం పార్టీని స్థాపించారు. ముస్లిం హక్కులు, విద్యాభివృధ్ధి కోసం ఏర్పడ్డ ఎంఐఎం క్రమక్రమంగా బలమైన రాజకీయ పునాదులు వేసుకుంది. అబ్దుల్ వాహిద్ ఒవైసీ తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్లాలు చేపట్టి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. 

సలావుద్దీన్ ఒవైసీ 1967, 1972, 1978 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత హైదరాబాద్ పార్లమెంటుకు 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సలావుద్దీన్ ఒవైసీ విజయాన్ని అడ్డుకోవడానికి బీజేపీ 1996 ఎన్నికల్లో వెంకయ్య నాయుడిని హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి బరిలో దింపినా ఫలితం లేకపోయింది. సలావుద్దీన్ ఒవైసీ 73వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది 1986లో 38 డివిజన్లు గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది 2002లో 36 డివిజన్లు గెలుచుకుంది. 2009లో 43 డివిజన్లు గెలుచుకుని కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని మేయర్ పీఠాన్ని పంచుకుంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 44 డివిజన్లు గెలుచుకుని తన సత్తా చాటుకుంది.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 7మంది సభ్యులు ఎంఐఎంకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్ పాలనాపరమైన నిర్ణయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

సలావుద్దిన్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2008 నుండి ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు 1994, 1999 ఎన్నికల్లో చార్మినార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నుండి 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. అసదుద్దీన్ సారధ్యంలోనే ఎంఐఎం పార్టీ పాతబస్తీ దాటి బయట ప్రాంతాలకు విస్తరించింది.

1996లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి గెలుపొంది ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఎంఐఎంకు ఏడుగురు శాసనసభ్యులున్నారు. మహారాష్ట్రలో ఎంఐఎంకు ఇద్దరు శాసన సభ్యులున్నారు బిహార్, ఢిల్లీ, యూపీ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేసింది. మహారాష్ట్రలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లను ఎంఐఎం గెలుచుకుంది.

ఈసారి జరిగే ఎన్నికల్లో పాతబస్తీపై గట్టిపట్టున్న మజ్లిస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు చేజారకుండా వ్యూహలు రచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు కేటాయించిన ఎంఐఎం.. చార్మినార్ ఎమ్మెల్యేగా ఉన్న అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్ పురాకు.. యాకుత్ పురా ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను చార్మినార్‌కు పరస్పరం మార్పులు చేశారు.  చాంద్రాయణ గుట్ట నుండి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్ పేట నుండి మహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా, బహదూర్‌పురా నుండి మహ్మద్ మౌజం ఖాన్, నాంపల్లి నుండి జాఫర్ హుసేన్ మెరాజ్, కార్వాన్ నుండి కౌసర్ మోహియుద్దీన్ పోటీ చేయనున్నారు. ఒకవైపు మిత్రపక్ష పార్టీ టీఆర్ఎస్‌తో స్నేహపూర్వక పోటీ మరోవైపు కాంగ్రెస్ కూటమి, బీజేపీ అభ్యర్దులను ఎదుర్కోవాల్సి ఉన్నందున తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు ఎంఐఎం వ్యూహలకు పదును పెడుతూ తన అభ్యర్దులను ప్రకటించింది.

ఎంఐఎం పార్టీ మొదటి నుండి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుతుంటుంది. మొదట్లో 
కాంగ్రెస్‌కు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రమైన విబేధాలు రావడంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో అక్బరుద్దీన్‌ జైలుకు వెళ్లడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంఐఎం సమైక్యాంధ్రకే జై కొట్టింది. చివరలో రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చింది  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి ఎంఐఎం దగ్గరైంది. ఎంఐఎం పార్టీకి చెందిన ఒవైసీ హాస్పిటల్స్, విద్యాలయాలకు ప్రభుత్వం ద్వారా భూములు లబ్ది పొందారనే ఆరోపణలున్నాయి

అయితే ఈ సారి యాకుత్ పురా, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎంఐఎంకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే విశ్లేషణ వినిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా యాకుత్ పురా అభ్యర్దిని మార్చడంతో పాటు మిత్రపక్ష టీఆర్ఎస్‌ను అనుసరించి ముందుగానే అభ్యర్దులను ప్రకటించింది ఎంఐఎం. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న ముస్లింల ఓటు బ్యాంకును ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎంకు స్నేహహస్తం అందిస్తుంటుంది. ఎంఐఎం కూడా అదే పంధాలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి మద్దతు తెలుపుతుంటుంది

పాత బస్తీలో పట్టు సడలకుండా ఉండేందుకు ముందుగానే అభ్యర్దులను ప్రకటించిన ఎంఐఎం ఎన్నికల వ్యూహంలో భాగంగా నోటిఫికేషన్ కంటే ముందే తొలి జాబితా ప్రకటించి ప్రత్యర్ది పార్టీల కంటే ముందే ప్రచార పర్వానికి తెరలేపింది.

-కుమార్

Don't Miss