క‌ర్నాట‌క‌లో వాన‌రంతో బ‌స్సు న‌డిపించిన డ్రైవ‌ర్..

16:51 - October 6, 2018

బెంగ‌ళూరు: క‌ర్నాట‌క‌లో ఓ బ‌స్సు డ్రైవ‌ర్ చేసిన ప‌ని అత‌డి ఉద్యోగానికి ఎస‌రు తెచ్చింది. అత‌డి 'కోతి' చేష్ట‌లు అత‌డి ఉద్యోగం పోవ‌డానికి కార‌ణం అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ దావణగెరెలో కోతితో బస్సు నడిపించాడు. కోతి స్టీరింగ్‌పై కూర్చుని అటు ఇటు తిప్పితే.. డ్రైవర్ దాన్ని హ్యాండిల్ చేశాడు. ఈ తతంగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కోతి చేసిన పని చూసి కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం బస్సు డ్రైవర్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను గాలికొదిలేయ‌డం క‌రెక్ట్ కాదంటున్నారు. డ్రైవ‌ర్ నిర్లక్ష్యం పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక‌పోతే విష‌యం ఆర్టీసీ ఉన్న‌తాధికారుల వ‌ర‌కు చేరింది. దీంతో స‌దురు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో కానీ.. ఆ కోతి బ‌స్సులోకి దూరింది. గుండ్రంగా ఉన్న స్టీరింగ్ ను చూసి ముచ్చ‌ట‌ప‌డిందో మ‌రో కార‌ణ‌మో కానీ.. 'నేను కూడా బస్సు నడుపుతాను’ అని కోతి బస్సు స్టీరింగ్ పట్టుకుని ఎంతకూ వదల్లేదు. సరేలే ముచ్చపడుతుంది కదా అనుకున్న డ్రైవర్.. సదరు వానరంతో బస్సు నడిపించాడు. ఇదే అత‌డి పాలిట శాప‌మైంది. డ్యూటీలో ఎంతో బాధ్య‌త‌గా ఉండాల్సింది పోయి.. ఈ కోతి చేష్ట‌లు ఏంటి? అని మండిప‌డుతూ అత‌డిని ఉద్యోగంలో స‌స్పెండ్ చేశారు అధికారులు.

Don't Miss