అశ్రున‌య‌నాల‌తో మూర్తి అంతిమ సంస్కారాలు

17:09 - October 7, 2018

విశాఖ‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంతిమ సంస్కారాలు పూర్త‌య్యాయి. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు అశ్రున‌య‌నాల‌తో తుదివీడ్కోలు ప‌లికారు. గీతం యూనివ‌ర్సిటీ స‌మీపంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ద‌హ‌న సంస్కారాలు పూర్తి చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాల‌కృష్ణ, ప‌లువురు మంత్రులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. అంత‌కుముందు అశేష జ‌న‌వాహిని న‌డుమ అంతిమ‌యాత్ర సాగింది. అంత‌కు క్రితం మూర్తి భౌతిక‌కాయానికి ప‌లువురు ప్ర‌ముఖులు నివాళి అర్పించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప‌లురువు మంత్రులు, టీడీపీ నేత‌లు, బీజేపీ నేత పురంధేశ్వ‌రి మూర్తి భౌతిక‌కాయానికి నివాళి అర్పించారు. మూర్తితో త‌న‌కున్న అనుబంధాన్ని సీఎం చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు.

ఈ నెల 2న ఎంవీవీఎస్‌ మూర్తి(80) అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు సన్నిహితులు కూడా మృత్యువాత పడ్డారు. అమెరికాలోని ఆంకరేజి సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మూర్తితోపాటు ఆయన మిత్రులు నలుగురు కాలిఫోర్నియా నుంచి పయనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం(అక్టోబ‌ర్2) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలస్కా సిటీ వద్ద డాడ్జ్‌ వ్యాన్‌లో మూర్తి, ఆయన సన్నిహితులు వెలువోలు బసవపున్నయ్య(78), వీరమాచినేని శివప్రసాద్, వీవీఆర్‌ చౌదరి(చిన్న), కడియాల వెంకటరత్నం(గాంధీ) వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ ముందు వెళ్తున్న ఫోర్డ్‌ ఎఫ్‌–150 అనే ట్రక్కును తప్పించబోతుండగా దాన్ని ఢీకొని అదుపుతప్పి పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న మూర్తి, బసవపున్నయ్య, శివప్రసాద్, చౌదరిలు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన గాంధీ అలస్కా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్‌ను కొల్గిన్‌ కొస్కీ అనే యువకుడు నడుపుతుండగా పక్కన 21 ఏళ్ల యువతి, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్‌ పక్కన శివప్రసాద్‌ కూర్చోగా మిగిలిన వారు వెనక సీట్లలో కూర్చున్నారు.

Don't Miss