జనసేనలో చేరనున్న నాదెండ్ల మనోహర్

12:18 - October 11, 2018

హైదరాబాద్: ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరనున్నారు. రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. 

న‌వ‌త‌రం రాజ‌కీయాలే ల‌క్ష్యంగా నాదెండ్ల‌ మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌నున్నారని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 12న అందుకు ముహుర్తం ఖ‌రార‌య్యింది. జ‌న‌సేన చీఫ్ పవన్, మ‌నోహ‌ర్ మధ్య కొంతకాలంగా స్నేహం కొన‌సాగుతోంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి జ‌న‌సేన సైద్దాంతిక విధానాలపై ప‌వ‌న్‌‌తో మనోహర్  మాట్లాడుతూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా జ‌న‌సేన పార్టీ స‌భ‌లు, ప‌వ‌న్‌ ప్ర‌సంగాల‌ని కూలంకుషంగా ప‌రిశీలిస్తూ త‌న అభిప్రాయాల‌ని తెలియ‌జేస్తున్నారు. పవన్ భావ‌జాలం, నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌ రాజ‌కీయ ల‌క్ష్యాలు ఒకే విధంగా ఉండ‌డంతో, వీరిద్ద‌రి మైత్రి మ‌రింత బ‌ల‌ప‌డింది. రాజ‌కీయ విలువ‌లు, ఉన్న‌త ల‌క్ష్యాలు క‌లిగిన మ‌నోహ‌ర్ రాక‌తో జ‌న‌సేన పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

Don't Miss