గవర్నర్ పై అసత్య కధనాలకు అరెస్టు

16:28 - October 9, 2018

చెన్నై: తమిళ వార పత్రిక ఎడిటర్ నక్కీరన్  గోపాల్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర గవర్నర్  బన్వరిలాల్ పురోహిత్  పై  అసత్య కధనాలు ఫ్రచురించినందుకు ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూణే వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన్ను ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రోఫెసర్ నిర్మలాదేవి విధ్యార్ధినిలను వ్యభిచారంలోకి దింపుతున్నారని, ఆమె విద్యార్ధినులను రాజ్ భవన్ కు తీసుకువెళుతున్నారని నక్కీరన్ పత్రికలో కధనాలు వెలువడ్డాయి. దీంతో రాజ్ భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన వార్తలను గవర్నర్ ఖండించారు. కాలేజీ విద్యార్ధినులను మభ్యపెట్టి వ్యభిచారంలోకి  దింపుతున్నారనే ఆరోపణలతో ఏప్రిల్లో నిర్మలాదేవిని అరెస్టు చేసి పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.గవర్నర్  ను  కలిసినట్లు నిర్మలాదేవి పోలీసు విచారణలో చెప్పారు .ఈకేసు విచారించేందుకు విశ్రాంత ఉన్నతాధికారి ఆర్‌.సంథమ్‌ను  నియమించారు. ‌కేసు విచారణ  జరుగుతోంది.  
నక్కీరన్ గోపాల్ అరెస్టు అప్పుడే తమిళనాట రాజకీయ దుమారం రేపింది. గోపాల్ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించటమేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నక్కీరన్ గోపాల్ ను అరెస్టు చేయించిందిని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. మరోవైపు...సరైన సాక్ష్యాధారాలు లేకుండా వార్త ప్రచురించటం తప్పు అని గోపాల్ అరెస్టును సమర్దిస్తూ టీటీవీ దినకరన్ అన్నారు. కాగా గోపాల్  ను   అరెస్టు చేసిన చింతాద్రిపేట పోలీసు స్టేషన్ వద్ద రాజ్యసభ  సభ్యుడు, ఎండీఎంకే నేత వైగో ధర్నా నిర్వహించారు. గతంలో కరడుగట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్  తో  నక్కీరన్ గోపాల్ ఇంటర్వ్యూ చేసి తన పత్రికలో ప్రచురించి ప్రాముఖ్యం పొందారు.  

 

Don't Miss