ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ముఖచిత్రం

15:59 - November 5, 2018

నల్లగొండ: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొనసాగుతోంది. పొత్తుపొడుపులు సరిగ్గా కుదిరితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాకూటమి బలీయంగా మారనుంది. అయితే పార్టీల అసంతృప్తులు బరిలోకి దిగితే.. సీన్‌ మారిపోనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..

సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. టీజేఎస్‌ను పక్కన పెడితే. కాంగ్రెస్‌తో పాటు.. టీడీపీ, సీపీఐలకు సంస్థాగతంగా బలముంది. ఆ రెండు పార్టీలు ఒంటరిగా విజయం సాధించే పరిస్థితుల్లో లేకున్నా.. పలు నియోజకవర్గాల్లో ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు కూటమి పార్టీల వలన అదనపు బలం కలిసి వస్తుందని హస్తం నేతలు అంటున్నారు. 

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా.. కాంగ్రెస్, సిపిఐ ఒక కూటమిగా.. టీడీపీ, బీజేపీ మరో కూటమిగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేశాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో ఆరు టీఆర్ఎస్‌ గెలుచుకోగా, సీపీఐకి ఒకటి కాంగ్రెస్‌ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.

* ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు
* గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌ 6, కాంగ్రెస్‌‌ 5, సీపీఐ ఒక స్థానంలో విజయం
* నల్లగొండలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐలకు సంస్థాగతంగా బలం
* మహాకూటమితో బలపడతామంటున్న కాంగ్రెస్‌

గత ఎన్నికల్లో దేవరకొండలో కాంగ్రెస్‌, సీపీఐ కూటమి తరుపున పోటీ చేసిన రవీంద్రకుమార్ 57 వేల 717 ఓట్లతో గెలవగా.. రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేతావత్ బిల్యానాయక్ 53 వేల 501 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన లాలూనాయక్ 38,618 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కలిసి బరిలోకి దిగుతుండడంతో వారిద్దరికి వచ్చిన ఓట్లు 1,11,218 గా ఉన్నాయి. తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని కూటమి పార్టీలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నాయి. గతంలో సిపిఐ అభ్యర్థిగా విజయం సాధించిన రవీంద్రకుమార్ ఈ సారి టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. క్రాస్ ఓటింగ్ జరిగినా.. అంత భారీస్థాయిలో ఉండదని కూటమి నేతల అభిప్రాయం. 

సీపీఐ రవీంద్రకుమార్‌ 57,717 ఓట్లు
టీడీపీ కేతావత్ బిల్యానాయక్ 53,501 ఓట్లు
టీఆర్ఎస్ లాలూనాయక్ 38,618 ఓట్లు

ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున కుందూరు జానారెడ్డి 69,684 ఓట్లతో విజయం సాధించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య 53,208 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ మూడవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి కడారి అంజయ్య యాదవ్‌కు 27,858 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ప్రస్తుత కూటమి ప్రకారం చూస్తే టీఆర్ఎస్ కంటే 44,334 ఓట్లు మహాకూటమికి అధికంగా ఉన్నాయి. 

కాంగ్రెస్ భాస్కర్‌రావు 62,059 ఓట్లు
టీఆర్ఎస్ అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి 56,006 ఓట్లు

మిర్యాలగూడలో గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భాస్కర్‌రావుకు 62,059 ఓట్లు రాగా.. రెండవ స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి 56,006 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ ఓట్లను కలిపి చూస్తే 26,812 ఓట్లు కూటమికి అధికంగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన భాస్కర్‌రావు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి అమరేందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరడంతో ఓటర్లు ఎలా రీసివ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Image result for uttam kumar reddyటీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రస్తుత కూటమిని పరిగణనలోకి తీసుకుంటే కూటమికి 49,319 ఓట్లు ఆధిక్యత ఉంది. అయితే గత ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగిన హుజూర్‌నగర్‌లో ఈ సారి ద్విముఖ పోటీ చోటు చేసుకోనుంది. గతంలో వైసీపీకి పోల్ అయిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఇక మొదటి నుంచీ టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపని కోదాడలో మహాకూటమి ఓటింగ్ గణనీయంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి 81,966 ఓట్లతో విజయం సాధించగా.. గట్టి పోటీనిచ్చి రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 68,592 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్‌ 13,404 ఓట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒకే కూటమిగా ఉండటంతో గత ఎన్నికల ప్రకారం వారి ఓటింగ్ 1,37,154కు చేరుకుంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్‌కు అవకాశం ఉన్నా.. అంత భారీస్థాయిలో ఉండకపోవచ్చన్నది విశ్లేషకులు అభిప్రాయం.

Image result for jagadeesh reddyమంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో ఈసారి హోరాహోరీ తప్పదనిపిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన చతుర్ముఖ పోటీలో జగదీష్‌రెడ్డి 43,554 ఓట్లతో గెలుపొందగా.. రెండవ స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు 41,335 ఓట్లు.. మూడవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డికి 39,175 ఓట్లు, నాలుగవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డికి 38,529 ఓట్లు పోలయ్యాయి. అయితే ఇప్పుడు దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి ఒకే పార్టీలో ఉండటంతో పాటు.. కూటమిగా బరిలో దిగుతుండడం.. సంకినేని బీజేపీ తరుపున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సారి త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓటు షేరింగ్ అనేది కీలకంగా మారింది. 

భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన పైళ్ల శేఖర్‌రెడ్డి 54,686 ఓట్లతో విజయం సాధించగా..39,270 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి రెండవ స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు 33,560 ఓట్లతో మూడవ స్థానం.. 24,569 ఓట్లతో టిడిపి అభ్యర్థి ఉమామాధవరెడ్డి నాలుగవ స్థానంలో నిలిచారు. అయితే ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఆ పార్టీకి బలంగా మారింది. 

ఇక తుంగుతుర్తిలో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల ప్రకారం.. ప్రస్తుత మహాకూటమికి 29,293 ఓట్ల ఆధిక్యం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి గాదరి కిశోర్ 64,382 ఓట్లతో గెలుపొందగా.. రెండవ స్థానంలో అద్దంకి దయాకర్‌కు 62,003 ఓట్లు, మూడవ స్థానం సాధించిన పాల్వాయి రజనికుమారికి 31,672 ఓట్లు వచ్చాయి. 

Related imageఇక నల్లగొండలో గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి పోటీనిచ్చి కేవలం 10,547 ఓట్లతో ఓటమిపాలైన స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో కంచర్లకు మద్ధతుగా నిలిచిన టీడీపీ ఓటింగ్ ఈసారి ఎటు నిలిస్తే వారిదే విజయంగా రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది.

ఆలేరులో గతంలో ద్విముఖ పోటీ జరుగగా.. ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. మోత్కుపల్లి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతుండటంతో.. ఓట్ల షేరింగ్‌ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

మొత్తానికి ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ను కూటమి ఎలా నిలువరిస్తుందో చూడాలి. కూటమి పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరగకుండా కట్టడి చేయగలుగుతారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. తాజా కూటమి 2009 మహాకూటమిలా చివరంచులో బోల్తా పడుతుందో.. లేక మహాబలిగా నిలబడుతుందో తెలియాలంటే.. డిసెంబర్ రెండవ వారం వరకు ఆగాల్సిందే.

 

Don't Miss