ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్దు.. కోదండ‌రామ్‌కు నాయిని సూచ‌న‌

16:19 - October 8, 2018

హైద‌రాబాద్: తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధికార ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా మ‌హాకూట‌మిని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నాయ‌కులు మాట్లాడుతున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు(టీజేఎస్) కోదండ‌రామ్‌పై టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత నాయిని న‌ర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నిక‌ల్లో రెండు మూడు సీట్లు గెలిచి నువ్వు ఏం సాధిస్తావ్ ? అని కోదండ‌రామ్‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. కోదండ‌రామ్ అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మమని సూచించారు. అంతేకాదు ఏదో ఒక పార్టీకి స‌పోర్ట్ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు.
ఉద్య‌మం స‌మ‌యంలో కోదండరామ్‌కు టీఆర్ఎస్, కేసీఆర్ ఎంతో సాయం అందించార‌ని నాయిని గుర్తు చేశారు. తాము మ‌ద్ద‌తివ్వ‌కుంటే జేఏసీ ఏమ‌య్యేద‌ని ప్ర‌శ్నించారు. మ‌హాకూట‌మిలో బాగంగా కోదండ‌రామ్ పార్టీకి కాంగ్రెస్ వాళ్లు మూడు సీట్లే ఇస్తామ‌ని అంటున్నారని.. కోదండ‌రామ్‌కు ఎందుకంత దీనావ‌స్థ అని నాయిని వ్యాఖ్యానించారు. రెండు మూడు సీట్ల‌కు ఎందుకు పాకులాడుతున్నావ్? ఒక‌టి రెండు సీట్లు గెలిచి నువ్వు సాధించేది ఏంది? అని నిల‌దీశారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో 200మంది చ‌నిపోవ‌డానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ కార‌ణమని ఆరోపిస్తూ అలాంటి వాళ్ల‌తో ఎలా చేతులు క‌లుపుతార‌ని నాయిని మండిప‌డ్డారు.

Don't Miss