బ్యాంకులనే కాదు కస్టమర్లనూ మోసం చేసిన నీరవ్

16:54 - October 8, 2018

ఢిల్లీ:వంద అబద్దాలు ఆడి ఓ పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. కానీ ఇక్కడ నకిలీ వజ్రాలు బహుకరించే సరికి కుదిరిన పెళ్లి కాస్త క్యాన్సిల్ అయ్యింది,  దాంతో ఆ పెళ్లికొొడుకు లబోదిబో మంటూ వజ్రాల వ్యాపారి పై కేసు పెట్టాడు.ఇంతకీ ఆ వజ్రాల వ్యాపారి ఎవరనుకుంటున్నారు? మన దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీయే.
సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ అనే అనే పత్రిక కథనం ప్రకారం.. నీరవ్‌ మోడీ జూన్ లో కెనడాకి చెందిన పౌల్‌ ఆల్ఫోన్సో అనే వ్యక్తికి సుమారు 2లక్షల డాలర్ల విలువ కలిగిన రెండు డైమండ్‌ ఉంగరాలను హాంకాంగ్ లో అమ్మాడు. అందులో ఒక రింగును ఆల్ఫోన్సో తన గర్ల్ ఫ్రెండ్ కు బహుకరించాడు. ఆమె డైమండ్ రింగ్ లు చెక్ చేయించగా అవి నకిలీవని తేలింది, ఆ విషయం ఆల్ఫోన్సో కు చెప్పిన అతని  గర్ల్ ప్రెండ్ ఎంగేజ్ మెంట్ రద్దు  చేసుకుంది. నీరవ్ చేసిన పనికి గర్ల్ ఫ్రెండ్ దూరమైన ఆ వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆల్ఫోన్సో నీరవ్ మోడీ పై  రూ.31కోట్ల నష్టపరిహారం కోరుతూ కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు.
పంజాబ్ నేషనల్  బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన కేసులో నీరవ్ కు చెందిన సుమారు 600 కోట్లరూపాయల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు ఇటీవల జప్తు చేసి, నీరవ్ ని ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ లో బ్యాంకులను మోసం చేసిన కేసులో భాగంగానే  నీరవ్ పై ఇంటర్ పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. నీరవ్ మోడీ బ్యాంకును చేసిన మోసం వెలుగులోకి వచ్చింది,  ఇప్పుడు తాజాగా నకిలీ వజ్రాలు అమ్మిన విషయం బయటపడింది. నీరవ్ ఇలా ఇంకెంత మందికి నకిలీ వజ్రాలు అమ్మాడో మున్ముందు తెలియాల్సి ఉంది. 

Don't Miss