ధర్మపురిలో స్మశాన వాటిక లేని ధీన స్థితి

15:16 - October 7, 2018

జగిత్యాల : తెలంగాణలోనే ప్రసిద్దిగాంచిన గ్రామంలో స్మశాన వాటికకు గతి లేదు.. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురిలో దహన సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. పాలకులు, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో.. మా ఊరి స్మశానం మేమే నిర్మించుకుంటామంటూ యువత ముందుకొచ్చి వినూత్నరీతిలో నిరసన తెలిపింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా ఉన్న ధర్మపురిపై 10టీవీ కథనం..

జగిత్యాల జిల్లా ధర్మపురి దక్షిణ కాశీగా పేరొందింది. కానీ అక్కడి వాస్తవ పరిస్థితి మాత్రం  పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది.  ఇక్కడ కాటిలో కష్టాలు తిష్టవేశాయి. శవాలకు అంతిమ సంస్కారం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ సమస్యను స్థానికులు ఎన్నోసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తిసుకెళ్ళినా స్పందన లేదు. దీంతో.. విసిగివేసారిన  స్థానిక యువత 'నా ఊరి స్మశాన వాటిక నేనే నిర్మించుకుంటా' అన్న నినాదంతో  భిక్షాటన  చేపట్టారు...   
 
గతంలో అక్కడున్న గోదావరి నదిలోనే అంతిమ సంస్కారాలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు... ఎందుకంటే..  ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి  భారీగా వరద నీరు.. ధర్మపురిలోని పుష్కర ఘాట్లకు చేరడంతో సమస్య జఠిలమైంది. దీంతో శ్మశాన వాటిక నిర్మాణం కోసం యువత కదిలింది.. తప్పనిసరి పరిస్థితిలో సుమారు 500 మంది యువకులు భిక్షమెత్తి.. దాదాపు 30 వేల రూపాయలు సేకరించారు. 

సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న దేశ విదేశీయులు స్పందిస్తున్నారు.  వారంతా విరాళాలిచ్చేందుకు సైతం ముందుకొస్తున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఓ స్మశాన వాటికను నిర్మాణం చేసేలా చూడాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 

Don't Miss