ఇవాళ తెరుచుకోనున్న శబరిమల ఆలయం

10:00 - November 5, 2018

కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు ఒక్క రోజు దర్శనానికి సర్వం సిధ్దమైంది. ఇవాళ సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో గత నెలలో జరిగిన రగడ తెలిసిందే.. ఈ నేపధ్యంలో మరోసారి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. రేపు అర్ధరాత్రి వరకూ సెక్షన్ 144 కొనసాగనుంది

మహిళలకు అయ్యప్ప దర్శనం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు అవుతుందో లేదో అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం చితిర అట్ట విశేషం పేరుతో జరిగే ఒక్క రోజు పూజకు ఆలయద్వారాలు తెరుచుకుంటాయ్. ఐతే ఈసారి మహిళల ప్రవేశంపై ఆంక్షలు కోర్టు రద్దు చేసిన నేపధ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. 

గతనెలలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పోలీస్ శాఖ భారీగా బందోబస్తు చేసింది. దాదాపు 5వేలమంది పోలీసులను భద్రతకోసం నింపేదిసింది. వీరిలో 50ఏళ్ల వయసు దాటిన మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. ఒక్క భక్తులను తప్ప..మిగిలిన వారిని అనుమతించే ప్రసక్తే లేదని పథనం తిట్ట జిల్లా ఎస్పీ నారాయణన్ ప్రకటించారు.  ఇద్దరు ఐజీలు, పదిమంది డిఎస్పీలు ఈ ఒక్క రోజు దర్శనం కోసం ఏర్పాటు చేసిన భద్రత సిబ్బందిని పర్యవేక్షిస్తారు. మరోవైపు పంబ పరిసరాల్లో మహిళాసంఘాలు దర్శనం కోసం చేరుకున్నట్లు తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే పిసి జార్జ్ స్వయంగా పదేళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉన్న
మహిళలు బాలికలు స్వామి దర్శనంకోసం సిధ్దంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు గవర్నర్‌కి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు మహిళల దర్శనంపై ఆంక్షలను కోరుతున్న భక్తులు కూడా వీరిని అడ్డుకునేందుకు సిధ్దమైనట్లు తెలుస్తోంది. ఐతే ఇలా కోర్టు తీర్పు ప్రకారం దర్శనం కలిగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయ్. ఇలా చేయడం కేరళని వందేళ్ల వెనక్కి తీసుకెళ్తోందని జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత
ఎంటి వాసుదేవన్ నాయర్ అన్నారు. పాతకాలపు సంప్రదాయాలను అమలు చేయాలని చెప్పడం వాటిని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 543 కేసులు రిజిస్టర్ చేసి 3701మందిని అరెస్ట్ చేశారు. ఈ చర్యలు భక్తులను రెచ్చగొట్టేందుకే తప్ప ఇంకోటి కాదని..బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముక్తకంఠంతో విమర్శించడం విశేషం. ఈ నేపధ్యంలో శబరిమల ఆలయ పరిసరాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొన్నది.

Don't Miss