విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా.. హైదరాబాదీ అరెస్టు

13:14 - November 6, 2018

హైదరాబాద్: విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఓ ట్రావెల్ ఏజంటును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అతని వద్దనుంచి రూ 8.60 లక్షల నగదు, 3,100 అమెరికన్ డాలర్లు, పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.  
వివరాల ప్రకారం ఓసా గంగాధర్ అనే వ్యక్తి నిరుద్యోగులకు వలవేస్తూ వారిని విదేశాలకు పంపుతానని చెప్పి మోసగించాడు. ఈ విధంగా దాదాపు 40-50 మంది నిరుద్యోగులను నిలువునా ముంచినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. గంగాధర్ గతంలో దుబాయ్, సౌదీ అరేబియా, సింగపూర్, ట్రినిడాడ్, టొబాగో, ఖతార్, బ్యాంకాక్, జోర్డాన్, ఇండోనేషియా తదితర దేశాల్లో పనిచేసి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. ఒక్కొక్క నిరుద్యోగి నుండి 4 నుంచి 5 లక్షల వారివారి ఆర్థిక పరిస్థితి మేరకు వసూలు చేశాడు. వారి వద్దనుండి నగదు, వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఢిల్లీలో నివాసం ఉండే.. పునీత్ అనే వ్యక్తి ద్వారా వారి డాక్యుమెంట్లు సిద్ధం చేసేవాడు. పునీత్ ఇండో-ఇజ్రాయల్ ట్రావెల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందు వల్ల ఈ పనికి అతనిని ఉపయోగించుకొనేవాడు. ఒకసారి డబ్బులు చేతికి అందిన తర్వాత నిరుద్యోగులకు అందుబాటులో లేకుండా తప్పించుకొనేవాడు. దీంతో గంగాధర్‌కు ఫోన్ చేసినా దొరికేవాడు కాదు. గంగాధర్ 15 సిమ్ కార్డులు మార్చినట్టు పోలీసులు గుర్తించారు. అతని వద్దనుంచి అభ్యర్థుల ఇంటర్ మార్కుల సర్టిఫికెట్లు, వివిధ పేర్లతో ఉన్న 3 పాస్‌పోర్టులు, 3 ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు సీజ్ చేశారు. అతని వద్దనుంచి 3 మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్, ఒక టూవీలర్, 9 ఇండియన్ పాస్‌పోర్టులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి మధ్యవర్తులను నమ్మిమోసపోవద్దని పోలీసులు నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు.  

 

 

Don't Miss