తీవ్ర అనారోగ్యంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్

15:28 - October 9, 2018

ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్ అయిన ఉగ్రవాది మసూద్ అజహర్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మసూద్.. కొంత కాలంగా మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల సమాచారం. వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో మసూద్ బాధపడుతున్నాడని, రావల్పిండిలోని ఓ మిలిటరీ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.

మసూద్ స్వగ్రామమైన భవల్‌పూర్‌, పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కానీ ఇటీవలి కాలంలో అతడు కనపడలేదని తెలుస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితమయ్యాడట. దీంతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను మసూద్ సోదరులు రాఫ్ అస్గర్, అత్తర్ ఇబ్రహీం చూసుకుంటున్నారు. భారత్, ఆప్థనిస్థాన్‌లపై ఉగ్రవాద దాడులు ఆ ఇద్దరి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం.

1999లో కాందహార్ హైజాక్ ఎపిసోడ్‌లో ప్రయాణికులకు ఎలాంటి హాని కలగకుండా ఉండటానికి ప్రతిగా భారత్ విడుదల చేసింది ఈ మసూద్ అజహర్‌నే. 2005లో అయోధ్యలో, 2016లో పఠాన్‌కోట్‌లో జరిగిన దాడుల వెనుక సూత్రధారి కూడా మసూద్ అజహరే. ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని కోరుతూ భారత్, అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చైనా వాటిని అడ్డుకుంటోంది.

Don't Miss