తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ట్టుసాధించ‌లేక‌పోతే అది మీ త‌ప్పే-ప‌వ‌న్

11:53 - October 7, 2018

విజయవాడ: జ‌న‌సేన టిక్కెట్లు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే ద‌య‌చేసి నమ్మొద్దని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. జ‌న‌సేన పార్టీలో టిక్కెట్లు కేటాయించేందుకు ఓ కమిటీ ఉంటుందని ప‌వ‌న్ తెలిపారు. టిక్కెట్ల కేటాయింపు విధానంలో పారదర్శకత ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. జనసేన నిర్మాణం ఆలస్యమైనా పక్కాగా ఉంటుందని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

విజయవాడ భారతీనగర్ లోని పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ప‌వ‌న్ సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. ధవళేశ్వరం బ్యారేజిపై నిర్వహించే భారీ కవాతుతో జనసేన పార్టీ సత్తాను దేశవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ఆ కవాతు తర్వాత దేశం మొత్తం జనసేన గురించే మాట్లాడుకోవాలన్నారు. కవాతుకు అందరూ సహకరించాల‌ని పవన్ విజ్ఞ‌ప్తి చేశారు. జనసేనకు తూర్పుగోదావరి జిల్లా ఆయువుపట్టు అన్న ప‌వ‌న్... 19 నియోజకవర్గాల్లో 20 నుంచి 22 రోజుల పాటు పర్యటిస్తానన్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో మరో రెండ్రోజుల్లో పోరాట యాత్ర పూర్తవుతుందని ప‌వ‌న్ పేర్కొన్నారు.  15న కవాతుతో తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టి పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందన్న ప‌వ‌న్... తూర్పుతోనే మార్పు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి జిల్లాలో చాలా బలముందన్న ప‌వ‌న్ ఇక్కడ పట్టు సాధించలేకపోతే ఆ తప్పు నాయకులదే అవుతుందన్నారు. పార్టీలో కోటరీలు కట్టే విధానానికి తాను వ్యతిరేకమ‌ని.. పితాని బాలకృష్ణ మినహా జనసేన పార్టీ నుంచి ఎవరికీ సీటు ఇవ్వలేదని పవన్‌ ప్రకటించారు.

Don't Miss