ఈనెల 5న పవన్‌కళ్యాణ్ పోలవరం యాత్ర

14:20 - October 4, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరోయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరుయాత్ర  నిర్వహిస్తున్న ఆయన.. ఈనెల 5 నుంచి పోలవరం యాత్ర చేపట్టబోతున్నారు. దీంతో పవన్‌ పోలవరం యాత్రపై ఉత్కంఠ నెలకొంది. పవన్‌ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరాటయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన తన యాత్రలో విమర్శల దాడి పెంచారు. టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. సీఎంపైనా.... మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎవరినీ ఆయన వదల్లేదు. అందరిపైనా సందర్భానుసారం విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌ ఇంతకుముందు కూడా యాత్ర చేశారు. కానీ అప్పుడు అధికారపార్టీపై ఇంత ధాటిగా విమర్శలు గుప్పించిలేదు. అధికారపక్షంపై ఇప్పుడు ఆయన ఒంటి కాలిమీద లేస్తున్నారు.  సీఎంతోపాటు ఆ పార్టీ నాయకుల మీద పదునైన విమర్శలు చేస్తూ... జనసేనపై ఒక్కసారిగా అంచనాలు పెంచారు. 
 
పశ్చిమ యాత్రలో పవన్‌ కల్యాణ్‌ ప్రధానంగా పోలవరంపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. తరచూ పోలవరం ప్రాజెక్ట్‌,  పోలవరం నిర్వాసితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయకుండా 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

పోలవరంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు... పోలవరం సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకునేందుకు కూడా పవన్‌ సిద్ధమయ్యారు. ఈనెల 5న ఆయన పోలవరం నుంచి తన పర్యటన కొనసాగించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లో పర్యటించి పనులను పరిశీలించనున్నారు. కొన్ని నెలల క్రితం టీడీపీతో కలిసి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌లో పవన్‌ పర్యటించి .. పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మళ్లీ ఇప్పుడు పవన్‌ పోలవరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తన రెండు రోజుల పోలవరం పర్యటనలో ఏయే అంశాలు తెరపైకి తీసుకొస్తారో చూడాలి. 

Don't Miss