చంద్రబాబు-రాహుల్ కలయికపై ఫేస్‌బుక్‌లో పవన్ సెటైర్

13:12 - November 3, 2018

హైదరాబాద్: దేశం కోసం అంటూ కాంగ్రెస్-టీడీపీలు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కాగా టీడీపీ-కాంగ్రెస్ కలయికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీ ప్రజలకు తీరని అన్యాయం, ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడంపై పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్‌తో కలవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.

తాజాగా రాహుల్ గాంధీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. 'స్టాచ్యూ ఆఫ్ పిటీ' పేరుతో ఓ కార్టూన్‌ని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహంపై కప్పిన శాలువాను తీసి  రాహుల్‌కు చంద్రబాబు ఇస్తున్నట్టు అందులో ఉంది. ఇక తన పోస్టులో అవకాశవాద రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ తీరుని ఎండగట్టారు. తెలుగు ప్రజలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వివక్ష చూపింది, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన తీరుని పవన్ అందులో ప్రస్తావించారు. పాలకుల కారణంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే.. ఏపీ ప్రజలను బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాజకీయాల్లో ఉన్న కొందరు వ్యాపారవేత్తలు వారి స్వార్థం కోసం ఏపీని విభజనకు సహకరించారని పవన్ ఆరోపించారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మన ఎంపీలపై దాడి చేసి వారిని బయటకు తోసేశారని, దాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మర్చిపోలేరని పవన్ అన్నారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం పని చేస్తే వేర్పాటువాద ఉద్యమాలు పెరిగిపోతాయని గతంలోనే నరేంద్ర మోడీకి సైతం చెప్పానని పవన్ గుర్తు చేశారు. ఈ క్రమంలో అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించకూడదని రాహుల్ గాంధీకి పవన్ విజ్ఞప్తి చేశారు. అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Don't Miss