జనసేనాని ప్రజాపోరాట యాత్ర

08:03 - November 2, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. జనసైనికులతో కలసి రైలు ప్రయాణం చేయనున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించనున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో పవన్‌కు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరోవైపు జగన్ పై దాడి ఘటన నేపథ్యంలో పవన్ టూర్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజకీయ చైతన్యానికి వేదికైన తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ ప్రజాపోరాట యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఈనెల 9వ తేదీ వరకూ జిల్లాలో పవన్ పర్యటిస్తారు. కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. జనసేన  కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ యాత్ర చేపట్టారు. రైతులు, కార్మికులతో పాటు ప్రజలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు.  పొలిటికల్ టూర్‌లో భాగంగా తొలిసారిగా జిల్లాకు పవన్ కల్యాణ్ వస్తున్న నేపధ్యంలో ఆయన అభిమానులు,   జనసనేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. 

జనసైనికులతో కలసి పవన్ కల్యాణ్ రైలు ప్రయాణం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటా 20నిమిషాలకు విజయవాడలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పవన్ బయలుదేరతారు. అక్కడి నుంచి తుని వరకు ఆయన రైల్లో ప్రయాణిస్తారు. ఈ క్రమంలో వచ్చే  అన్ని రైల్వే స్టేషన్లలో అభిమానులు పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతారు. విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం స్టేషన్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది. తొలిరోజు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ లో  నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.

మొన్నటి వరకు పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ధవళేశ్వరంలో కవాతు నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ రావడంతో అక్కడకు వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రజల్లోకి  వెళ్లడానికి ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. పవన్ రానుండటంతో.. జనసేన పార్టీ నేతలు జోష్ లో ఉన్నారు.. జనసేనాని ఇఫ్పటి వరకు కేవలం ముమ్మిడివరం నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు.. అయితే ఈ ధఫా టూర్ లో మరికొన్ని స్ధానాలకు  అభ్యర్ధులను ప్రకటిస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.. నియోజకవర్గాల వారిగా ఉన్న సమస్యలను ఇప్పటికే పవన్ దృష్టికి తీసుకువెళ్లిన నేతలు.. ఆయన రాకతో తమ గ్రాఫ్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.. ప్రధానంగా జిల్లాలోని ఎస్ఈజడ్.. వంతాడ,   ఇసుక మైనింగ్ పై పవన్ దృష్టి సారించి నియోజకవర్గాల వారిగా నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారంటున్నారు జిల్లా పార్టీ నేతలు.. 

ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో పవన్ ప్రజాపోరాట యాత్రకు పోలీసులు అధిక ప్రాధాన్యనిస్తున్నారు. పవన్ సమీపంలోకి అభిమానులు, కార్యకర్తలను అనుమతించబోమని తెలిపారు. సెల్ఫీలు తీసుకోవడం నిషేధించడం జరిగిందని.. ఎవరైన  నిబంధనలు అతిక్రమిస్తే చర్యలకు వెనుకాడేది లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. 

ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్ సంకల్ప యాత్ర నిర్వహించారు. తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్రకు రానుండటంతో.. జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. 

Don't Miss