టీడీపీనే టార్గెట్‌ చేసిన పవన్‌ కళ్యాణ్

11:12 - October 3, 2018

పశ్చిమ గోదావరి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్వరం మారుతుందా..? ప్రజా పోరాటయాత్ర మొదటి, రెండు విడతల్లో పవన్‌ స్వరానికి మూడవ విడత స్వరానికి మార్పు కనిపిస్తోందా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొదటి, రెండు విడతల పోరాట యాత్రల్లో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడాలేకుండా ఇద్దరి మీదా విరుచుకుపడ్డ పవన్‌.. ఇప్పుడు కేవలం అధికారపార్టీనే టార్గెట్‌ చేశారు. అంతేకాదు.. ప్రతిపక్ష వైసీపీకి సానుకూల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వైసీపీ పట్ల పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది..

జనసేనాని తన స్వరం మార్చుకున్నారు. నిన్నమొన్నటి వరకు టీడీపీ, వైసీపీలను కలిపి ఏకిపారేసిన పవన్‌... ఇప్పుడు టీడీపీనే టార్గెట్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరినీ వదలకుండా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో పవన్‌ స్వరంలో స్పష్టమైన మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది.  పవన్‌ తన యాత్రలో చేస్తున్న వ్యాఖ్యలు.. రాజకీయ సర్కిల్‌లో చర్చకు తెరలేపాయి. గత రెండు విడతల్లో అధికార, ప్రతిపక్ష పార్టీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పవన్‌.. మూడవ విడతలో టీడీపీపైనే  ఫోకస్‌ పెట్టారు. ప్రతిపక్ష పార్టీని పూర్తిగా టచ్‌ చేయడం లేదు. గత సభల్లో వైసీపీపైనా , అధినేత జగన్‌పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు జరుగుతున్న యాత్రలో పవన్‌... వైసీపీ అధినేతపై అనుకూల కామెంట్స్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు జగన్‌ అంటే భయమని, 2014 ఎన్నికల్లో జగన్ గెలిచేఅవకాశముందని చంద్రబాబు తనతో చెప్పారని పవన్‌ అన్నారు. అంతేకాదు.. జగన్‌ను ఓడించాలంటే తన ఒక్కడి వల్ల కాదని.. నా సహకారం ఉండాలని చంద్రబాబు కోరినట్టు వివరించారు. 

జగన్‌కు అనుకూలంగా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్‌కు చంద్రబాబు భయపడుతున్నారన్న వ్యాఖ్యలను వైసీపీ నేతలు ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్‌ అలాంటి కామెంట్స్‌ చేయడం తమకు ఉపయోగమనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు.

Don't Miss