విశాఖలో చెడ్డీగ్యాంగ్ కదలికలను గుర్తించిన పోలీసులు

15:29 - October 9, 2018

విశాఖ : విశాఖ నగరంలో చెడ్డీగ్యాంగ్ కలకలం రేపుతోంది. మధురవాడలో హల్ చల్ చేసింది. దసరాకు ముందే గ్యాంగ్ నగరంలో తిష్టవేసింది. చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ కదలికలతో నగరవాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

నగరంలో ఉంటున్న వైజాగ్ వాసులు దసరాకు సొంతూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇళ్ళళ్లో చోరీ చేసేందుకు చెడ్డీగ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో నగర శివారు మధురవాడలో పోతిన మల్లయ్యపాలెంలోని పనోరమా హిల్స్‌లో 66 నెంబర్ విల్లా వద్ద ఈ గ్యాంగ్‌ సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరా దృశ్యాల అధారంగా పోలీసులు నిర్ధారించారు. నలుగురు సభ్యులు సంచరిస్తున్నట్లు పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేశారు. ఆ గ్యాంగ్ సభ్యులు గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. అపార్ట్‌మెంట్‌తోపాటు రెండు, మూడు ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ రాత్రిపూట తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖాలు కనపడకుండా ముసుకులు వేసుకుని ఇళ్ళళ్లోకి చొరబడుతున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన చెడ్డీగ్యాంగ్ ఉత్తరాంధ్రలో సంచరిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చెడ్డీగ్యాంగ్ కదలికలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

 

Don't Miss