చింతమడకలో కేసీఆర్, ఖైరతాబాద్‌లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ : ఓటు వేయనున్న నేతలు

22:09 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. సతీసమేతంగా సోమాజిగూడలోని ఐసీడీఎస్ అంగన్ వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేయనున్నారు. సిద్ధిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలోని పోలింగ్ బూత్‌లో సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా.. ఆయన ఓటు మాత్రం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉంది. ఇక్కడే ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటారు. కేసీఆర్‌ తనయ .. నిజామాబాద్‌ ఎంపీ కవిత మాత్రం బోధన్‌ నియోజకవర్గం నవీపేట మండలం పొతంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు సిద్దిపేటలోని బూత్ నంబర్ 107 అంబిటస్ స్కూల్లో సతీ సమేతంగా ఓటు వేయనున్నారు.
ఇక కాంగ్రెస్ నేతల విషయానికొస్తే.. ముఖ్యనేతలంతా తన నియోజకవర్గాల్లోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను పోటీ చేస్తున్నహుజూర్‌నగర్‌లో ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి హైదరాబాద్ ఎంఎల్ఏ కాలనీలోని రోడ్ నంబర్ 12లో ఓటు వేస్తారు. ఇక తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్.. ఉదయం 8గంటలకు హైదరాబాద్ తార్నాకలో ఓటు వేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని శాంతినికేతన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 9లో ఓటు హక్కువినియోగించుకుంటారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి... లింగంపల్లిలోని దీక్ష మోడల్ స్కూల్‌లో ఓటు వేయనున్నారు. బంజారాహిల్స్‌లోని గౌరీ శంకర్ కాలనీలో సీఈసీ రజత్‌కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ గతంలో హైదరాబాద్‌లోనే ఓటు వేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్‌లోనే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. ఆయన మొదట్నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే ఓటు వేస్తున్నారు.

Don't Miss