ప్రొ-కబడ్డీ.. తమిళ తలైవాస్ చేతిలో యూపీ యోధా చిత్తు

13:48 - November 3, 2018

యూపీ: తమిళ తలైవాస్‌ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. యూపీ యోధాను చిత్తు చేసింది. 46-24 పాయింట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ జట్టు.... జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది.

ప్రొ - కబడ్డీ 2018 సీజన్‌ సిక్స్‌లో తమిళ్‌ తలైవాస్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ను మట్టికరిపించి అదుర్స్‌ అనిపించింది. ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓటమిపాలైంది. మళ్లీ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌తో తమిళ జట్టు ఫామ్‌లోకి వచ్చింది.

తమిళ్‌ తలైవాస్‌ జట్టు రాత్రి యూపీ యోధాతో తలపడింది. మొదట ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగినా ఆ తర్వాత తమిళ్‌ తలైవాస్‌ ఆధిపత్యం సాధించింది. అదే ఊపును చివరి వరకు కంటిన్యూ చేసి 46-24 పాయింట్ల తేడాతో యూపీ యోధాను చిత్తు చేసింది. సొంతగడ్డప జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 

మ్యాచ్‌ ప్రారంభం నుంచే తడబడిన యూపీ జట్టు ఫస్టాఫ్‌ ముగిసే సరికి 11-26 పాయింట్లతో వెనుకబడి పోయింది. తలైవాస్‌ జట్టు ఫస్టాఫ్‌లో సాధించిన ఆదిక్యంతో మరింత దూకుడుగా ఆడి విజయం సాధిందించింది. తలైవాస్‌ జట్టులో అజయ్‌ ఠాగూర్‌, కుఖేష్‌హెగ్డే చెరో 9 పాయింట్లతో చెలరేగారు.

మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ , జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడ్డాయి. పింక్‌ పాంథర్స్‌పై గుజరాత్‌ జట్టు 36-25 స్కోరుతో విజయం సాధించింది. ఆరంభంలో మ్యాచ్‌ హోరాహోరీగా సాగినా... ఆ తర్వాత వన్‌సైడ్‌గా జరిగింది. గుజరాత్‌ ధాటికి జైపూర్‌ జట్టు విలవిల్లాడిపోయింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌లో అనిల్‌కుమార్‌, దీపక్‌‌హుడా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయారు. గుజరాత్‌ టీమ్‌లో సునీల్‌‌కుమార్‌ 8 రైడ్‌ పాయింట్లు సాధించాడు.

Don't Miss