టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నిరసన సెగ

09:37 - November 5, 2018

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్‌ఎస్‌ ఒకడుగు ముందుకేసి ఇంటింటి ప్రచారాన్ని సైతం నిర్వహిస్తోంది. ప్రచారంతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పలుచోట్ల ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ప్రచారం నిర్వహిస్తోన్న  టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, రసమయి బాలకిషన్‌కు ప్రజల నుంచి నిరసన ఎదురైంది.

రాజన్న సిరిసిల్ల సిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల, కందికట్కూర్‌ గ్రామాల్లో తాజీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది.  నాలుగేళ్ల పాలనలో తమకేమి చేశావంటూ రసమయిని వంతడుపుల గ్రామస్తులు అడ్డుకున్నారు. మా గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు.  దీంతో రసమయి  అక్కడ ప్రచారాన్ని ముగించుకుని  పక్కనున్న కందికట్కూర్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని  మిడ్‌ మానేరు ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు... గ్రామస్తులు, మహిళలతో వాగ్వాదానికి దిగారు.  గ్రామస్తులపైకి దాడికి యత్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మహిళలను నెట్టివేయడంతో వారు రసమయిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్‌శాపురంలో తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గ్యాదరి కిషోర్‌కు నిరసన సెగ తగిలింది.  ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామన్న హామీ ఏమైందంటూ యువకులు గ్యాదరి కిషోర్‌ను నిలదీశారు. కొండగడపలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు.. టీఆర్‌ఎస్‌ నాయకులతో వాగ్వాదానికి దిగారు. అనాజిపురంలో పట్టాపాస్‌ పుస్తకాలు అందలేదంటూ...కిశోర్ ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని.. గాదరి కిశోర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మార్పీఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గత ఎన్నికల్లో నేతలు ఇచ్చిన హామీలను నెరేవర్చకపోవడంతో ప్రజలు వారిని నిలదీస్తున్నారు. దీంతో నాయకులకు నిరసన సెగలు తప్పడం లేదు.

Don't Miss