స్వచ్చభారత్ కు తూట్లు

21:26 - October 8, 2018

జైపూర్: స్వచ్చ  భారత్ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో మార్పు తీసుకు వస్తుంటే ఆ పార్టీకి చెందిన నేతలు మోడీ ఆశయానికి  తూట్లు పొడుస్తున్నారు. లేటెస్ట్ గా రాజస్ధాన్ కు  చెందిన మంత్రి శంభు సింగ్ ఖేటసర్ బహిరంగ మూత్ర విసర్జన చేసి వార్తల్లో కెక్కారు. మంత్రి గారు మూత్రవిసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారి నెటిజన్ల విమర్శలు ఎదుర్కుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  అజ్మీర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభకు హజరయ్యే క్రమంలో సభా వేదికకు సమీపంలోనే  మంత్రిగారు లఘుశంక తీర్చుకున్నారు. పైగా ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్  పక్కనే ఆయన మూత్ర విసర్జన చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఇదేం పని మంత్రి గారు అని అడిగితే స్వచ్ఛ భారత్‌ ఉద్దేశ్యం  బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని తాను చేసిన పనిని సమర్ధించుకున్నారు ఆ పెద్ద మనిషి. తను చేసిన ఈ పనిని  ఇది పెద్దవారి సాంప్రదాయమని చెప్పడం కొసమెరుపు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా  టాయిలెట్స్‌ లేవని చివరకు తప్పు ఒప్పుకున్నారు సదరు మంత్రిగారు. 

Don't Miss