ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

19:39 - October 9, 2018

ఢిల్లీ : ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు పాపకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పది నెలల పాప వీపుపై ఉన్న కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. పాపకు ఉస్మానియా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య నిపుణుల బృందం అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసింది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్‌ గ్రామానికి చెందిన ఇర్షాద్‌, సన దంపతుల కుమార్తె అనీలా.  పుట్టినప్పుడే అనీలా వీపుపై చిన్న గడ్డ ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ పాపతో పాటు కణితి పరిమాణం కూడా పెరుగుతూ వస్తోంది. తల్లిదండ్రులు పాపను తొలుత హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో చూపించి వైద్యం చేయాలని కోరారు. కానీ ఫలితం లేకుండా పోవడంతో మిన్న కుండిపోయారు. 10 నెలల వయస్సులో కణితి పరిమాణం పెరగడంతో చిన్నారి ఇబ్బంది పడింది. దాంతో తల్లిదండ్రులు ఇటీవలే ఉస్మానియా ఆస్పత్రిలోని న్యూరోసర్జరీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీధరాల శ్రీనివాస్‌ను సంప్రదించారు. చిన్నారికి పలు రకాలైన రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ పలుకూరి లక్ష్మీ, అనస్థీషియా ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ పాండునాయక్‌లతో కలిసి ఈ నెల 6న శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సుమారు రూ.3లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ సహకారంతో ఉస్మానియాలో పూర్తి ఉచితంగా చేశామని న్యూరోసర్జరీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీధరాల శ్రీనివాస్‌, సత్యనారాయణ తెలిపారు. ఫోలికాసిడ్‌ లోపం వల్ల జన్మించే పిల్లల్లో ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెప్పారు. గర్భిణి కావడానికి 6 నుంచి 8 నెలల ముందే ఫోలికాసిడ్‌ మాత్రలు వేసుకోవడం వల్ల జన్మించే పిల్లలకు ఎలాంటి జబ్బులు, లోపాలు ఉండవని పేర్కొన్నారు. 

 

Don't Miss