మరోసారి భారీగా క్షీణించిన రూపాయి

12:42 - October 3, 2018

ఢిల్లీ : రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరోసారి భారీగా క్షీణించింది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది. 73.34 వద్ద అత్యంత కనిష్టానికి రూపాయి పడిపోయంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.34 వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. మంగళవారం నాటి సెషన్‌లో 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. నేడు 35 పైసలు నష్టపోయి 73.26 వద్ద ప్రారంభమైంది. కాసేపటికే మరింత దిగజారి 73.34 వద్ద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో రూపాయి మారకం విలువ 73.33గా కొనసాగుతోంది.

దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 1,842కోట్ల పెట్టబడులను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉంది. కాగా.. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. నేటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Don't Miss