హిడెన్ టాలెంట్.. బేబీ పాటకు సోషల్ మీడియా ఫిదా!

14:50 - November 6, 2018

హైదరాబాద్: ఆమె ఎక్కడా.. ఎప్పుడూ ‘‘పాడుతా తీయగా’’ లాంటి టీవీ ప్రోగ్రామ్‌లలో పాడలేదు. పనీపాట చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న పసల బేబీ అనే మహిళ పాడిన పాటకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఎంతో శ్రావ్యంగా.. ఎక్కడా తొణికసలాట లేకుండా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘ప్రేమికుడు’ సినిమా కోసం అందించిన సంగీతఝరికి పదాలు అద్దిన మహిళకు సోషల్ మీడియాలో కళాప్రియులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ మట్టిలో మాణిక్యం గురించిన వివరాలు తెలుసుకోవాలని అనిపించడంలో అతిశయోక్తి లేదని ఈ కధనాన్ని అందిస్తున్నాం. 
పసల బేబీ సొంతూరు.. వడిశలేరు గ్రామం..తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని ఓ కుగ్రామం. ఈమె దినసరి కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటోంది. ఎవరో అమ్మాయి తప్పుగా పాడితే తట్టుకోలేక బేబీ తన గళాన్ని విప్పిందని ‘ఈనాడు’ తెలుగు దినపత్రికలో ప్రచురించారు. కూనిరాగాలు మాత్రమే తీసే బేబీ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకొంది. 
‘‘ఓ చెలియా నా ప్రియసఖియా’’ అంటూ పాడిన బేబీ గొంతుకు ఎక్కడలేని క్రేజీ వచ్చింది. ఈ వీడియోకి ఫేస్‌బుక్‌లో 11 వేల లైకులు, 14,389 షేర్లు దక్కగా కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.  అపారమైన గ్రాహకశక్తితో బేబీ తన పాటల ప్రపంచాన్ని సృష్టించుకుంది. అయితే..ఎప్పుడూ పెద్దగా నలుగురిలో పాడిన సందర్భాలు లేవు. అనుకోకుండా ఒక యువతి చేసిన చిరు ప్రయత్నంలో భాగంగా ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ కావడంతో బేబీలోని టాలెంట్ తెలుగు సంగీత అభిమానులకు చేరింది. శంకర్ దర్శకత్వంలో ‘‘ప్రేమికుడు’’ సినిమాలో ఉన్ని కృష్ణన్ 1994లో పాడిన పాటకు బేబీ తన గొంతు కలపడం ఒక విచిత్రం. ఈ వీడియోలో బేబీ పాడిన పాటను మీరూ వినండి!    

Don't Miss