పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సామి గర్జన

18:15 - September 21, 2018

చియాన్ విక్రమ్ 15 సంవత్సరాలక్రితం తమిళ్ లో సామి అనే సినిమా చేసాడు. నటుడిగా తనకీ,దర్శకుడిగా  హరికీ సామి మంచిపేరు తెచ్చిపెట్టింది. తెలుగులో బాలకృష్ణ లక్ష్మీనరసింహ గా రీమేక్ చేస్తే, ఇక్కడకూడా హిట్ అయింది.. తర్వాత హరి, సూర్యతో సింగం సిరీస్ లో మూడు సినిమాలు చేసాడు. 
ఇప్పుడు విక్రమ్,హరి కాంబోలో స్వామికి సీక్వెల్ గా తమిళ్ లో  సామి  స్క్వేర్ పేరుతో రూపొంది, తెలుగులో సామి గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


కథ : -
డి.సి.పి. పరశురామ స్వామి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న స్వామి, తన పేరెంట్స్ చావుకి కారణమైనవాళ్ళని వెతికిపట్టుకుని, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. 
ఒకరోజు దియా అనే అమ్మాయిని రౌడీల బారినుండి కాపాడుతాడు. అక్కడనుండి లవ్ ట్రాక్ మొదలవుతుంది. కొద్దిరోజుల తర్వాత తన తల్లిదండ్రుల్ని చంపింది రావణ మరియు అతని బ్రదర్స్ అని స్వామికి తెలుస్తుంది. ఇక అక్కడినుండి సింహం వేట స్టార్ట్ అవుతుంది.మొత్తనికి స్వామి తన పగని ఎలా తీర్చుకున్నాడు,ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు?అనేది మిగితా కథ.

విక్రమ్ నటుడిగా ఎలా కష్టపడతాడో,ప్రయోగవంతమైన పాత్రల్ని ఎంత సమర్ధవంతంగా పోషిస్తాడో తెలిసిందే. 
సామి విషయానికొస్తే, పవర్ ఫుల్ పోలీస్ ఆఫర్ పాత్రలో విక్రమ్ మరోసారి తన సత్తా చాటాడు. తండ్రిగా,కొడుకుగా రెండు డిఫరెంట్ రోల్స్ లో నటన,డైలాగ్స్ పరంగా రెచ్చిపోయాడు.అద్భుతమైన అతని స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. 
కీర్తి సురేష్,ఐశ్వర్య రాజేష్  గ్లామర్ పరంగా పర్వాలేదు కానీ, నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.  రావణ గా బాబీ సింహ తనదైన శైలి విలనిజాన్నిప్రదర్శించాడు. కోట శ్రీనివాస రావు తో సహా మిగతా నటీనటులు ఉన్నంతలో బాగానే చేసారు. 
దేవి శ్రీ ప్రసాద్ సింగం మ్యూజిక్ లాంటి మ్యాజిక్ చెయ్యడానికి ట్రై చేసాడు కానీ, పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. 
తన సినిమాల్లో హీరోని పవర్ ఫుల్ అండ్ ఊరమాస్ పోలీస్ ఆఫీసర్ గా ఓ రేంజ్ లో చూపిస్తాడు దర్శకుడు హరి. పోలీస్ కథలతోనే హిట్స్ సాధించాడు.సామి విషయంలోనూ అదే రిపీట్ అవుతుంది అనుకున్నాడు కానీ,ఈసారి ఎక్కడో తేడా కొట్టింది. సామి హరినుండి ఆడియన్స్ ఆశించే సినిమా అయితే కాదు. 
విక్రమ్ గురించి సామి సినిమా ఒకసారి చూడొచ్చు. 

    
 రేటింగ్ : 2.5/5

Don't Miss