పోలీసు భద్రత నడుమ శబరిమల

21:11 - November 3, 2018

తిరువనంతపురం: కేరళలోని  ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ తలుపులుసోమవారం  తెరుచుకోనున్నాయి.  మాసపూజలో భాగంగా 5వ తేదీ సాయంత్రం  9 వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. శబరి మల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించవచ్చని సెప్టెంబరు 28 న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం , తీవ్ర ఉద్రిక్త పరిస్ధితుల  నడుమ అక్టోబరు 17 న ఆలయ తలపులు తెరవటం, కొందరు మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించటం,  భక్తుల నుంచి నిరసన రావటం  జరిగింది. గత నెలలో జరిగిన అనుభవాల  దృష్ట్యా ప్రభుత్వం  ముందు జాగ్రత్త చర్యగా  భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 16 వందల మంది పోలీసులతో భద్రతా చర్యలు ఏర్పాటు చేసింది. సన్నిధానం, పంబ, నిలక్కల్ ప్రాంతాల్లో   శనివారం సాయంత్రం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తామని, భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే పంబకు వెళ్లేందుకు అనుమతిస్తామని పత్తనంతిట్టా జిల్లా ఎస్పీ నారాయణన్  చెప్పారు. అలాగే మీడియా, భక్తులు తప్ప మిగతావారిని నిలక్కల్ నుంచి పంబకు అనుమతించమని,  డీజీపీ ఆదేశాల ప్రకారం.. ఇద్దరు ఐజీల పర్యవేక్షణలో పోలీసుల బృందం భద్రతను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఐదుగురు ఎస్పీలు, పది మంది డీఎస్పీలను నిలక్కల్, పంబ, సన్నిధానం, వడస్సేరికర ప్రాంతాల్లో విధులకు కేటాయించినట్టు తెలియజేశారు. సన్నిధానంలో ఎక్కువ సమయం  ఉండేందుకు ఎవర్నీ అనుమతించబోమని, సుప్రీంతీర్పుకు పోలీసులు కట్టుబడి ఉంటారని, భద్రత కల్పించమని ఎవరైనా మహిళలు కోరితే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ నారాయణన్ తెలిపారు.

Don't Miss