సెక్రటరీ చేతిలో బ్లాక్‌మెయిల్‌కు గురైన పేటీఎమ్ చీఫ్

12:58 - October 23, 2018

న్యూఢిల్లీ: ఆయనో పెద్ద కంపెనీకి బాస్.. వందల కోట్ల ప్రజల సొమ్ముకు కాపలాదారుడు. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా ఈ కంపెనీ యాప్‌ను ఉపయోగించాల్సిందే!. అదే పేటీఎమ్. పేటీఎమ్ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు. అక్కడ పనిచేస్తున్న సోనియా ధావన్ అనే మహిళను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. సోనియా తన బాస్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆయన్నే రూ. 20 కోట్లకు బ్లాక్‌మెయిల్ చేసిందని పోలీసులు తెలిపారు. సోనియా పేటీఎమ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయశేఖర శర్మకు పీఏగా ఢిల్లీలోని నోయిడా ఆఫీసులో  గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తోంది.   
తన సహచర ఉద్యోగి దేవేంద్రకుమార్, తన భర్త రియల్టర్ రూపక్ జైన్‌తో కలిసి ఈ నేరానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. విజయశేఖర శర్మ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న పేటీఎమ్ సంస్థ ప్రారంభం నుండి తారాస్థాయికి ఎదిగే వరకూ సోనియా కంపెనీలోనే పనిచేసింది. అలాగే దేవేంద్ర కూడా 7 ఏళ్ల నుండి పేటీఎమ్లోనే పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. విజయశేఖర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్, మోబైల్ ఫోన్, ఆఫీసు కంప్యూటర్‌తో సోనియాకు యాక్సిస్ ఉండటంతో సమాచారాన్ని దొంగిలించి.. వాటిని రోహిత్ కమల్ అనే నాలుగో వ్యక్తికి అందజేసింది. రోహిత్ విజయశేఖర్ తమ్ముడు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మకు డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ నష్టాల్లోకి పోతుందనీ.. కంపెనీ పరువు పోతుందని బెదిరించారు. ముందుగా కలకత్తాకు చెందిన రోహిత్ కోమల్ రూ 10 కోట్లు ఇవ్వాల్సిందిగా సెప్టెంబర్ 20న కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత నుంచి అతను కనిపించలేదు. ఈ సమాచారం బయటకు వెళ్లకుండా ఉండాలంటే తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని ఈ గ్యాంగ్ డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. 

 

Don't Miss