లైంగిక ఆరోపణల్లో తమిళ సినీ పాటల రచయిత వైరముత్తు

13:19 - October 9, 2018

చెన్నై: క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని శ్రీరెడ్డి కొద్ది నెలల క్రితం బయట పెట్టి సంచలనం సృష్టించింది. అప్పటికే హాలీవుడ్‌లో "మీ టూ" పేరుతో మొదలైన ఉద్యమం బాలీవుడ్‌లో పాకింది. అప్పటి నుంచి మహిళలు ఒక్కొక్కరుగా తమపై జరిగిన లైంగిక దాడిని ధైర్యంగా గొంతెత్తి చెబుతూ సెలబ్రిటీల బండారం బయటపెడుతున్నారు. దక్షిణాదిలో ఇటీవల సింగర్ చిన్మయి తనపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టి మీ టూ ఉద్యమాన్ని ఉధృతం చేసారు. 
లేటెస్ట్‌గా ప్రముఖ తమిళ పాటల రచయిత, పద్మవిభూషణ్ అవార్డుగ్రహీత వైరముత్తు తన దగ్గర పని చేసే సహాయకురాలిపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు.. జర్నలిస్టు సంధ్యామీనన్‌కు చెప్పారు. ఆమె ఈ విషయాన్ని, బాధితురాలు పంపిన వాట్సప్ మెసెజ్‌తో తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
తమిళ చిత్రపరిశ్రమలో లెజెండ్‌గా భావించే వైరముత్తు దగ్గర బాధితురాలు 18వ ఏట నుంచి పని చేస్తోంది. పాటల డిక్టేషన్ కోసం పిలిపించుకుని, దగ్గరకు తీసుకుని, ముద్దు పెట్టుకుని, కౌగిలించుకునే వాడని బాధితురాలు వాపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక భయం వేసి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయట పడేదాన్నని ఆమె చెప్పింది. ఆయన నిజస్వరూపం తెలిశాక ఒంటరిగా ఉండలేక నలుగురు ఉన్న చోట మాత్రమే ఉండేలా అలవాటు చేసుకున్నట్లు బాధితురాలు తెలిపినట్లు జర్నలిస్టు సంధ్యామీనన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైరముత్తుకున్న రాజకీయ పలుకుబడి ఇతర పరిచయాల వల్ల అతను చేసిన అఘాయిత్యాన్ని బయటకు చెప్పలేక ఇప్పుడు చెప్పినట్లు భాదితురాలు తెలిపింది.

Don't Miss