కల్తీ పాలకు మొబైల్ ఫోన్‌తో చెక్..!

17:31 - November 22, 2018

హైదరాబాద్: బైల్ ఫోన్‌తో పాల కల్తీని కనిపెట్టొచ్చా..? కచ్చితంగా కనిపెట్టొచ్చని హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు చెబుతున్నారు. ఫోన్ ఆధారిత సెన్సర్ల ద్వారా.. పాలల్లో కల్తీని సులువుగా కనుక్కోవచ్చని వీరంటున్నారు. అనడమే కాదు.. తమ ప్రొఫెసర్‌ల సహకారంతో.. ఈ దిశగా.. ఓ మొబైల్ సాఫ్ట్‌వేర్‌నూ రూపొందించారు. 
హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులు కొందరు, తమ ప్రొఫెసర్ శివగోవింద్ సింగ్ , అసిస్టెంట్ ప్రొఫెసర్లు సౌమ్య జానా, శివరామకృష్ణల నేతృత్వంలో ఈ పరిశోధన చేశారు. వీరు పాలల్లో ఆమ్ల గాఢతను గుర్తించేందుకు ఇప్పటికే ఓ ఇండికేటర్ పేపర్‌ను వాడుతున్నారు. ఇండికేటర్ పేపర్‌ను పాలతో తడపగానే.. పాలల్లో ఆమ్ల గాఢత ఎక్కువగా ఉంటే.. కాగితం రంగు మారిపోతుంది. పాల కల్తీని గుర్తించే క్రమంలో ఇది తొలి అడుగుగా ఈ పరిశోధక బృందం వెల్లడించింది. 
ఇండికేటర్ పేపర్ రంగులో మార్పులను సెల్‌ఫోన్ గుర్తించేలా వీరు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పాలల్లో కల్తీని గుర్తించేందుకు క్రోమటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ అవన్నీ బాగా ఖర్చుతో కూడుకున్నవి. ఇవి ప్రజలకు అంతగా అందుబాటులో లేనివి. అందుకే, అందరికీ అందుబాటులో ఉండేలా, చవకైన, చేతిలో ఇమిడిపోయేలా పాలకల్తీని పసిగట్టే పరికరాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ శివగోవింద్‌సింగ్ నేతృత్వంలోని విద్యార్థుల బృందం తెలిపింది. వీరి ప్రయత్నం సక్సెస్ కావాలని, పాల కల్తీ బెడద తప్పిపోవాలనీ కోరుకుందాం.

 

Don't Miss